తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ ను అరికట్టడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు. అన్ని వర్గాల నుంచి మద్దతు కోరుతున్నారు. చివరికి విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే.. అందులో కూడా గంజాయి ఏపీనుంచి తెలంగాణకు తరలివస్తున్న సంగతిని ఎజెండాలో పెట్టి.. దాని నిర్మూలను సహకరించాలని కోరారు. అయితే రేవంత్ ప్రయత్నాల పట్ల ధిక్కారంగా మాట్లాడిన హీరో సిద్ధార్థ్ ఆ వెంటనే నాలిక్కరుచుకుని సారీ చెప్పడం ఇప్పుడు తాజా హాట్ టాపిక్ గా ఉంది.
రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా.. అందరూ సహకరించాలని కోరుతున్నారు. అలాగే.. సినిమా హీరోలు రకరకాల రాయితీల కోసం, టికెట్ ధర పెంచుకోవాలనే అనుమతుల కోసం తరచూ తమ వద్దకు వస్తూ ఉంటారని.. అలాంటి హీరోలు ఇకమీదట డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తే మాత్రమే.. వారి సినిమాలకు రాయితీలు, ఇతర విషయాలు కన్సిడర్ చేస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం మాటలను భారతీయుడు 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో సిద్ధార్థ్ ధిక్కరిస్తూ మాట్లాడడం వివాదం అయింది. ‘నేను గతంలో స్వచ్ఛందంగా కండోమ్ వినియోగం ప్రచారంలో పాల్గొన్నాను. ఇలాంటివి చాలా చాలా చేశాను. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో మీరు అదిచేస్తేనే మేం మీకు ఫలానా సాయం చేస్తాం అంటూ హెచ్చరించింది లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు రేవంత్ ను ఉద్దేశించినవి కావడంతో వివాదం అయింది.
పైగా భారతీయుడు 2 ఈనెల 12న విడుదల కాబోతుండడంతో టికెట్ రేట్లు పెంచుకోవాలన్నా, స్పెషల్ షోలు కావాలన్నా.. ప్రభుత్వం వద్దకు వెళ్లాలి గనుక.. డైరక్టరు శంకర్ నుంచి కమల్ హాసన్ వరకు సిద్ధార్థకు అక్షింతలు వేసినట్టు సమాచారం. ప్రెస్ మీట్ లో సీఎంను ధిక్కరిస్తూ అలా మాట్లాడిన గంటల వ్యవధిలోనే సిద్ధార్థ్ తన తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ ను ఉద్దేశించి తాను అలా అనలేదని, ఆయన పట్ల చాలా గౌరవం ఉందని, ఆయన ప్రయత్నానికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని.. సారీలు చెప్పారు. మొత్తానికి శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని అందరూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచార సందేశాల వీడియోలు చేశారు. మొత్తానికి సిద్ధార్థ్ వల్ల రాగల నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ హీరో కాస్త ఓవరాక్షన్ చేయడంవల్ల, అంతలోనే నాలిక్కరుచుకోవాల్సి వచ్చిందని అంతా అంటున్నారు.
ఓవరాక్షన్ చేసి.. నాలిక్కరుచుకున్న హీరో!
Thursday, November 21, 2024