వరద ముప్పు కొంత శాంతించింది. ఇప్పుడిక సహాయక చర్యలు వేగంపుంజుకున్నాయి. సాధారణ పరిస్థితిని పునరుద్ధరించే చర్యలు కూడా మొదలవుతున్నాయి. రెండు తెలుగురాష్ట్రాలు వరద దెబ్బకు అతలాకుతలం అయిన నేపథ్యంలో.. కేంద్రం అందించబోయే సాయం కీలకంగా మారుతోంది. ఇప్పటికే కేంద్రం.. తెలుగురాష్ట్రాల వరద నష్టంపై దృష్టి సారించింది. ఏ రాష్ట్రానికి ఎంత సాయం అందుతుందనే చర్చ జరుగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తినప్పటికీ.. తీవ్రత, నష్టం విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణలో వరద ప్రభావానికి, ఏపీలో జరిగిన నష్టానికి పోలికే లేదు. బుడమేరుకు గండిపడడం అనేది అనూహ్యమైన నష్టాన్ని కలగజేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగురాష్ట్రాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆయన తిరిగారు. ఏపీలో కూడా కీలక ప్రాంతాల్లో వరద నష్టాన్ని పరిశీలిస్తారు.
అలాగే కేంద్రం వరద సహాయం, పునరుద్ధరణ పనులు, నష్టం అంచనా, రిజర్వాయర్ లో నిర్వహణ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు అయిదుగురు సభ్యలుతో ఒక నిపుణుల బృందాన్ని ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం పంపుతున్నది. కేంద్రం చేయాల్సిన సాయం, తక్షణం అవసరమైన చర్యల గురించి ఈ బృందం కేంద్రానికి నివేదిస్తుంది. కేంద్రబృందాలను పంపాల్సిందిగా చంద్రబాబు, అమిత్ షాను ఫోన్ లో కోరడంతో సాయంత్రానికి ఆ ఏర్పాటు చేశారు.
ఇప్పటిదాకా వరద నష్టాన్ని పూడ్చడానికి అందుతున్న విరాళాలను గమనిస్తూ ఉంటే సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు అందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా విరాళాలు ఇస్తూ వచ్చారు. కానీ వాస్తవంగా రెండు రాష్ట్రాలకు వాటిల్లిన విపత్తు సమానం కాదనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. వివక్ష అనే అపకీర్తి భరించాల్సి వస్తుందని అందరూ రెండు రాష్ట్రాలకు ఈక్వల్ గా ఇస్తున్నారు. కానీ.. కేంద్రం అలా చేయకుండా.. వాస్తవనష్టాల్ని పరిశీలించి తదనుగుణంగా ఏపీని పెద్దమనసుతో ఆదుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. మంచిగా తోడ్పాటు అందిస్తున్న కేంద్రం వరదల సాయం విషయంలో మరింత ఉదారంగా ఉండాలని ఆశిస్తున్నారు.