నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డితో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ కావడానికి ముహూర్తం ఖరారైంది. జులై 3వ తేదీనే నెల్లూరు పర్యటనకు జగన్ వెళ్లవలసి ఉండగా.. పోలీసులు అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా చివరినిమిషంలో ఆయన పర్యటన రద్దు చేసుకుని బెంగుళూరు వెళ్లిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు తీరిగ్గా.. పర్యటనకు తేదీ ఖరారు చేసుకున్నారు. కాకాణి గోవర్దన రెడ్డి అరెస్టు అయిన తర్వాత.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి ఇతర కీలక నాయకులు కూడా అరెస్టు అయి వేర్వేరు జైళ్లలో ఉన్నారు. అయితే.. జగన్ వారికంటె ముందు కాకాణి గోవర్దనరెడ్డిని కలవడమే జగన్ టాప్ ప్రయారిటీ గా భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కాకాణికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనుక ఒక రహస్యం దాగి ఉందని అంటున్నారు.
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసుల్లో కాకాణి గోవర్దన రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన మీద కేసులు నమోదు అయినప్పుడు.. పోలీసులను బట్టలు విప్పదీయించి కొడతానని ప్రగల్భాలు పలికిన కాకాణి గోవర్దనరెడ్డి ఆ తర్వాత పరారీలోకి వెళ్లిపోయారు. సుదీర్ఘకాలం కలుగులో దాక్కున్న ఆయన చివరకు బెయిలు ఆశలన్నీ అడియాసలు కావడంతో నిరాశపడ్డారు. ఈలోగా పోలీసులు ఆయనను అరెస్టు చేయడం కూడా జరిగింది. అప్పటినుంచి రిమాండులోనే ఉన్నారు. ఈలోగా క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత.. నిర్ఘాంతపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం అనిల్ కుమార్ యాదవ్ డైరెక్షన్ లోనే క్వార్ట్జ్ అక్రమమైనింగ్ దందా మొత్తం సాగినట్టుగా వెలుగులోకి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ ఈ అక్రమార్జనల సొమ్మును వేర్వేరు చోట్ల రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్టుగాను, హైదరాబాదులో కూడా వెంచర్లు వేసినట్టుగానూ, ఆఫ్రికాఖండంలో మైనింగ్ వ్యాపారంలోకి దిగినట్టుగానూ గుర్తించారు. ఈ మేరకు అదనపు వివరాలు సేకరించడానికి అనిల్ కుమార్ యాదవ్ కు కూడా నోటీసులు ఇచ్చారు. రేపో మాపో ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది.
వీటన్నింటి కంటె పెద్ద విషయం ఏంటంటే.. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ ప్రోత్పహిస్తూ.. అనిల్ యాదవ్ అండ్ కో సాగించిన వసూళ్లలో ప్రతినెలా 20 కోట్లరూపాయల వంతున, ముఖ్యనేతకు పంపారని కూడా పోలీసులు విచారణలో రాబట్టారు. ఈ ప్రకారం.. 9 నెలల వ్యవధిలో ఇంచుమించుగా 180 కోట్ల రూపాయలు ముఖ్యనేతకు చేరవేసినట్టుగా గుర్తించారు. ఇప్పుడు జగన్ టాప్ ప్రయారిటీగా కాకాణితో భేటీకి వెళ్లడానికి కూడా అదే కారణం అని తెలుస్తోంది. ముందు కాకాణిని కలిసి.. ఎంతలోతుగా విచారించినప్పటికీ.. తనకు చేరవేసిన వాటాల గురించి వివరాలు చెప్పకుండా జాగ్రత్త తీసుకోవాలని కాకాణిని ప్రలోభ పెట్టడానికే జగన్ వెళ్తున్నారని అంతా అనుకుంటున్నారు.
తనను కాపాడుకోవడమే.. కాకాణితో ములాఖత్ లక్ష్యం!
Monday, December 8, 2025
