మళ్లీ పవన్‌ను ఆశ్రయించనున్న తోట!

Tuesday, July 2, 2024

ఆయన ఒకప్పట్లో చిరంజీవి టీంలో ఉంటూ ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు గానీ భంగపడ్డారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు గానీ.. ఎన్నికల్లో నెగ్గాలనే కోరిక తీరలేదు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత.. ఆయన జట్టులో కీలక వ్యక్తి అయ్యారు. పవన్ కల్యాణ్ కోసం సోషల్ మీడియా బృందాలను ఆయనే నడిపారు. ఒక పత్రిక నడిపారు. ఒక టీవీ చానెల్ కూడా కొని నిర్వహిస్తూ వచ్చారు. ఆ పార్టీ తరఫున కూడా ఎన్నికల్లో పోటీచేసి కోట్లు ఖర్చుపెట్టినా పాజిటివ్ రిజల్ట్ రాలేదు. ఇన్ని చేసినప్పటికీ.. పవన్ జట్టులోంచి బయటకు వచ్చి హఠాత్తుగా గులాబీదళంలో చేరారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అనే హోదాను దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన పవన్ కల్యాణ్ నే ఆశ్రయించి.. ఆయన ప్రాపకంలోనే భవిష్యత్ రాజకీయ జీవితాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవ్వరో కాదు.. తోట చంద్రశేఖర్.

ఈ మాజీ సివిల్ సర్వీసెస్ అధికారి పార్లమెంటులో అడుగుపెట్టాలనే తన కోరికను మాత్రం ఇప్పటిదాకా నెరవేర్చుకోలేకపోయారు.  తోట చంద్రశేఖర్ జనసేన రాజకీయాల్లో స్థిరంగా ఉండి ఉంటే.. ఇప్పుడు ఆయనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ దక్కి ఉండేది. ఇప్పుడున్న చాలామంది కంటె ఆయన పార్టీకోసం ఎక్కువగానే పనిచేశారు, ఖర్చుకూడా పెట్టారు. కానీ సుమారు ఏడాది కిందట కొన్ని ప్రయోజనాల కోసం భారాసలో చేరి కేసీఆర్ తో గులాబీ కండువా కప్పించుకుని, ఏపీ అద్యక్షుడు అయ్యారు.

2009లో ప్రజారాజ్యం తరఫున గుంటూరు ఎంపీగాను,. 2014లో వైసీపీ తరఫున ఏలూరు ఎంపీగానూ పోటీచేసిన తోట చంద్రశేఖర్, 2019లో మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ఏ ఎన్నిక కూడా ఆయనను గెలిపించలేదు. గులాబీ పార్టీ కండువా కప్పుకుని, ఏపీ అధ్యక్షుడు అనే హోదాను తగిలించుకున్నారు గానీ.. దానివల్ల ఆయనకు ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్సు అయింది. భారాస అనే పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతోంది. భారాసను జాతీయ పార్టీగా రద్దు చేసుకుని, పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్రసమితిగా పెట్టుకోవడం గురించి వారు యోచన చేస్తున్నారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాలలో పార్టీ బాధ్యతల్లో నియమితులైన వారికి సూచనప్రాయంగా తెలియజెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తోట చంద్రశేఖర్ తన భవిష్యత్తు కోసం తిరిగి పవన్ కల్యాణ్ పంచకు చేరుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి అభ్యర్థుల ఎంపిక మొత్తం పూర్తియపోయి అంతా సమరాంగణంలో ఉన్నందున, ఆయనకు దక్కేదేమీ లేదు గానీ.. పార్టీకి అండగా ఉంటే గెలిచి , అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏదైనా ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తోట చంద్రశేఖర్ తిరిగి జనసేనలోకి పునరాగమనానికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారో చూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles