జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్లపాటూ డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా చెలరేగిన ఏకైక నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి! ముఖ్యమంత్రిగా జగన్ స్పందించవలసిన, మాట్లాడవలసిన సందర్భం ఏది వచ్చినా సరే.. సజ్జల వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ.. తాను జగన్ యొక్క గళం అని హవా చూపించుకున్నారు. ఆయనను అందరూ అప్పట్లో సకలశాఖల మంత్రి అని ముద్దుగా పిలుచుకున్నారు. ఏ మంత్రిత్వ శాఖలోనైనా మంత్రులు సంతకాలు పెట్టాల్సిందే తప్ప నిర్ణయాలు సజ్జల తీసుకుంటూ ఉంటారనేది దాని భావం. అంతటి వైభోగం వెలగబెట్టిన సజ్జల రామక్రిష్ణారెడ్డి భవిష్యత్తు ఇప్పుడు నలుగురు వ్యక్తుల చేతుల్లో ఉంది.
ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీపై కేసులు పెట్టించి అరెస్టు చేయించిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆ కేసులో బాగా ఇరుక్కున్నట్టే తెలుస్తోంది. కాదంబరి విజయవాడకు వచ్చి విచారణాధికారుల ఎదుట తన వాదనలు చెప్పుకుంది. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, అప్పటి కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్ని తనను టార్గెట్ చేశారని ఆమె పేర్కొంది. ఈ పోలీసు అధికారుల విచారణకు ఇప్పటికే రంగం సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో, అసలు నిందితుడు కుక్కల విద్యాసాగర్.. ఏ భూమి విక్రయానికి కాదంబరి ఫోర్జరీ సంతకాలతో ప్రయత్నించారంటూ కుక్కల విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారో.. ఆ కేసు బూమరాంగ్ అవుతోంది. విద్యాసాగర్ సాక్షులుగా పేర్కొన్నవారు.. అసలు తాము కాదంబరి నుంచి భూమికొనుగోలు ప్రయత్నమే చేయలేదని అంటున్నారు. తమ ఆధార్ కార్డులు వాడుకుని.. ఫోర్జరీ సంతకాలతో తమ పేరిట కేసు పెట్టించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ పూర్తిగా ఇరుక్కున్నట్టే. పైన పేర్కొన్న ముగ్గురు ఐపీఎస్ లు కూడా విచారణలో వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది.
విద్యాసాగర్ ఫిర్యాదు మీద పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం చూపించాల్సి వచ్చిందో వారు చెప్పాలి. ప్రభుత్వంలోని పెద్దల్లో ఎవరు వారిని పురమాయించారో చెప్పాల్సి వస్తుంది. విద్యాసాగర్ కూడా ఎవరి ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చారో వారు రాబట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ నలుగురిలో ఎవరు సజ్జల పేరు చెప్పినా.. ఆయన కూడా నిందితుడుగా ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన పేరు ప్రస్తావించిన మీడియా సంస్థలకు సజ్జల ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నలుగురిలో ఎవరు ఆయన పేరు చెప్పినా సరే.. ఇబ్బంది తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.
ఆ నలుగురి చేతిలో సజ్జల భవిష్యత్తు!
Sunday, December 22, 2024