తాడిగడప అనే ఊరు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘కడప’ అనే పేరుతో ఒక జిల్లా ఉన్నది గనుక.. ‘తాడిగడప’ అనే ఊరు కూడా ఆ జిల్లాలో ఉండవచ్చునని ఎవరైనా అనుకుంటే మనం తప్పు పట్టగలమా? కడప జిల్లాకు వైఎస్సార్ అని పేరు పెట్టారు కాబట్టి.. తాడిగడపను మునిసిపాలిటీగా మార్చినప్పుడు.. దానికి ‘వైఎస్సార్ తాడిగడప’ అని నామకరణం చేశారు కాబట్టి.. ఇది ఇది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనిది అని.. ఆయనతో అత్యంత అనుబంధం కలిగిఉన్న ప్రాంతమనీ కొత్తవారు భ్రమపడితే తప్పు అనగలమా?
అర్థం పర్థం లేకుండా ఎలాంటి సంబంధమూ లేకపోయినా.. అడ్డగోలుగా తన తండ్రి పేరును, విగ్రహాలను ఎక్కడపడితే అక్కడ ప్రతిష్ఠించేయడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్న వ్యక్తి వైఎష్ జగన్మోహన్ రెడ్డి. అతిశయంగా, పొగరుతో ఆయన చేసిన పనులను చక్కదిద్దే ప్రయత్నం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా రాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్సార్ మీద కక్ష సాధిస్తున్నారని, ఆయన పేరు చూసి భయపడుతున్నారని రకరకాల గోల చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ద్రోహం జరుగుతున్నట్టుగా రంగు పులమడానికి పాట్లుపడుతున్నారు. ఔచిత్యం లేని మాటలతో తమ పరువు తామే తీసుకుంటున్నారు. కానీ వారికి అర్థంకాని విషయం ఒకటుంది.. వైఎస్ పేరు చెబితే రాష్ట్ర ప్రజలు జాలిపడే రోజులు ఎన్నడో పోయాయి. అలాంటి పరిస్థితే ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయ్యేదే కాదు.. అని వారు తెలుసుకోవడం లేదు.
సాధారణంగా ఒక నాయకుడి పేరిట ఒక సంస్థకు నామకరణం చేయాలంటే.. ఆ సంస్థతో ప్రాంతంతో ఆయనకు కనీస అనుబంధం ఉండాలి. కడప జిల్లాకు గతంలో వైఎస్సార్ అనే పేరును జోడించినప్పుడు ఎవ్వరూ ఎలాంటి అభ్యంతరాలూ పెట్టలేదు. అలాగే రాష్ట్రంలో వైద్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టడం కూడా చాలా సబబు అనిపించుకుంటుంది. ఎందుకంటే.. వైద్య యూనివర్సిటీని ఏర్పాటుచేసిందే ఆయన! అలాంటిది ఆ సంస్థకు ఆయన పేరును తొలగించేసి వైఎస్సార్ పేరును పెట్టినప్పుడు.. దానిని గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా సమర్థించుకున్నారో గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది.
జగన్ తన తండ్రి ఆశయాలకోసం చేసిందేమీ లేకపోయినా.. ఆయన పేరుకు ప్రజల్లో ఒక క్రేజ్ ఉన్నదనే భ్రమలో.. దేనికి పడితే దానికి వైఎస్సార్ పేరు పెట్టడం, విగ్రహాలు పెట్టేయడం అలవాటుగా చేసుకున్నారు. అలాంటి వాటిని తొలగిస్తే ప్రజలకు ఎందుకు కోపం వస్తుంది. నాగార్జున యూనివర్సిటీ గానీ, క్రికెట్ స్టేడియం గానీ వాటి కోసం వైఎస్ ఏం చేశారని.. వాటి పుట్టుకలో ప్రస్థానంలో ఏం పాత్ర నిర్వర్తించారని ఆయన విగ్రహం అక్కడ పెట్టుకున్నారో వారికే తెలియాలి.
అయినా, అన్న క్యాంటీన్ల పేరిట కడుపేదలకు కడుపు నింపే వ్యవస్థలు ఏర్పాటు అయితే.. వాటిని నిలిపేసి, భవనాలను కూడా కూల్చేసి.. దుర్మార్గాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి దళాలకు చెందిన వారు.. వైఎస్ పేర్లను తొలగిస్తోంటే మొసలి కన్నీరు కార్చడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది.
వైఎస్సార్ పేర్లపై రచ్చ: జాలిపడే రోజులు పోయాయ్!
Saturday, March 22, 2025
