ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరుగుపొరుగు రాష్ట్రాలు. అన్నదమ్ముల వ్యవహారం లాగా ముందుకు సాగవలసిన రాష్ట్రాలు. అయితే అభివృద్ధి విషయంలో మాత్రమే కాదు- రాజకీయాల విషయంలో కూడా ఈ రెండు రాష్ట్రాల ప్రజల తీరు, వ్యవహా సరళి ఒకే తీరుగా ఉంటుందని ఒక అంచనా. ఆ కోణంలో గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హవా, భారత రాష్ట్ర సమితి ప్రాభవం దిగజారుతున్న తీరు చూసి ఏపీలో జగన్మోహన్ రెడ్డిలో గుబులు పుడుతోంది. భారాస నుంచి ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నారు. ఇవే పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా రిపీట్ అవుతాయేమో అనే భయం జగన్మోహన్ రెడ్డి ని వెన్నాడుతోంది.
కెసిఆర్- జగన్ మోహన్ రెడ్డి తండ్రి కొడుకుల లాగా ఆత్మీయమైన సంబంధాలను కలిగి ఉండేవాళ్ళు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గానీ ఆయన కొడుకు కేటీఆర్ గానీ ఒకటే మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారనే విశ్వాసాన్ని పదేపదే వ్యక్తం చేశారు. తద్వారా ఏపీ రాజకీయాలను తమకు తోచిన రీతిలో ప్రభావితం చేయడానికి వారు ప్రయత్నించారు. అయితే వారి అంచనాలన్నీ తప్పాయి. ఇప్పుడు వారి పార్టీనే మూతపడే దశకు చేరుకుంటూ ఉంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ కూడా కాంగ్రెసులో చేరబోతున్నారు. అక్కడికి మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భారాస నుంచి కాంగ్రెసులో చేరినట్లు అవుతుంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీలో చేరిపోయారు. త్వరలోనే మరో 6గురు ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీల చేరిక ఉంటుందని దానం నాగేందర్ ప్రకటిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిలో కూడా ఫిరాయింపుల భయం పుడుతోంది. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో కూడా కొందరు అధికార కూటమి పార్టీలలోకి ఫిరాయిస్తారా అని అనుమానిస్తున్నారు. శాసనమండలిలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. చాలామంది ఎమ్మెల్సీలు తెలుగుదేశం ఇతర కుటుంబ పార్టీలతో టచ్ లోకి వెళుతున్నట్లుగా సమాచారం వస్తోంది. మండలిలో ఉండే మెజారిటీకి కూడా గండి పడే విధంగా ఎమ్మెల్సీలు అధికార కూటమి పార్టీలలోకి చేరుతారని జగన్ భయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల తరహాలోనే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పతనావస్థకు చేరుకుంటుందేమో అని కేవలం జగన్ మాత్రమే కాదు వైసిపి నాయకులందరిలో కూడా భయం వ్యక్తమవుతోంది.
జగన్ లో గుబులు పుట్టిస్తున్న కేసీఆర్ పతనం!
Sunday, December 22, 2024