జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని, ఎప్పటికీ కోలుకోలేనంత దారుణంగా దెబ్బతీస్తున్నారని గత ఐదేళ్లపాటు తెలుగుదేశం జనసేన నాయకులు గగ్గోలు పెడుతుంటే ఢిల్లీ పెద్దలు అంత సీరియస్ గా తీసుకోలేదు. రాజకీయ ప్రత్యర్థులు గనుక జగన్ గురించి వారు అలా విమర్శలు చేయడం సహజమే అన్నట్టుగా వ్యవహరించారు. తీరా భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశంతో జట్టు కట్టిన తర్వాత, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి నాయకులు ఢిల్లీలో తమను కలిసినప్పుడు చెబుతున్న మాటల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి విధ్వంసం జరిగిందో అర్థమై వారు నిద్రపోతున్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గెలిచిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర మంత్రి నడ్డాను కలిసి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. వైకాపా పరిపాలనలో ఎంతటి విధ్వంసం జరిగిందంటే- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనీస స్థాయికి కోలుకోవడానికి కనీసం రెండు దశాబ్దాలు పడుతుందని సత్యకుమార్ జేపీ నడ్డాకు వివరించారు. నిధులు విడుదల విషయంలో కేంద్రం ఏపీ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని కూడా కోరారు.
ప్రత్యేకించి ఒక్కొక్క విభాగం గురించి తమ పార్టీకే చెందిన ఏపీ మంత్రి సత్య కుమార్ గత ఐదేళ్లలో ఏమేం విధ్వంసం జరిగిందో పూసగుచ్చినట్టుగా వివరిస్తూ ఉంటే ఢిల్లీ పెద్దలు నివ్వెరపోయినట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా పరిపాలన సాగించాడా? అనే అభిప్రాయం వారు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్ర ప్రజలు జగన్ ను ఓడించడం ద్వారా రాష్ట్ర పురోగతికి మేలుమలుపు వంటి తీర్పు చెప్పారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సతీష్ కుమార్ పర్యవేక్షిస్తున్న వైద్య శాఖ పరిధిలోని ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రెండున్నర వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టి జగన్ ప్రభుత్వం దిగిపోయిందని.. ఇప్పుడు ఏ ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చేర్చుకోవడానికి సుముఖంగా లేదని వాస్తవ పరిస్థితులను సత్యకుమార్ జేపీ నడ్డా కు వివరించారు. ఈ దుస్థితిని కొత్త ప్రభుత్వం ఎప్పటికి దూరం చేయగలుగుతుందో, కేంద్రం ఎంత మేరకు ఆదుకుంటుందో వేచి చూడాలి!
జగన్ నిర్వాకాలపై నివ్వెరపోతున్న ఢిల్లీ పెద్దలు!
Thursday, November 21, 2024