రాయలసీమ వాసుల చిరకాల స్వప్నం త్వరలోనే తీరబోతోంది. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సర్వం సిద్ధం అవుతోంది. త్వరలోనే ఇక్కడ హైకోర్టు బెంచ్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నట్టు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. హైకోర్టు ఏర్పాటుకు పరిశీలించదగిన భవనాలను ఇప్పటికే కలెక్టరు ఎంపిక చేసిపెట్టారు. వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు ఫిబ్రవరి 6వ తేదీన హైకోర్టు న్యాయమూర్తు బృందం కర్నూలుకు రానున్నట్లు కూడా ఫరూక్ చెప్పారు. దీంతో.. రాయలసీమ వాసుల చిరకాలస్వప్నం త్వరలోనే నెరవేరబోతున్నదని భావించాలి.
రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా.. కర్నూలులో హైకోర్టు బెంచ్ అనే ప్రతిపాదన నలుగుతూనే ఉంది. చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా.. అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూనే.. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు కసరత్తు చేశారు. భారతీయ జనతా పార్టీ కూడా అమరావతి ఏకైక రాజధాని అనే పాయింట్ తో పాటు, కర్నూలులో హైకోర్టు బెంచ్ అనేది తమ పార్టీ విధాన నిర్ణయంగా పెట్టుకుంది.
ఈలోగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మూడు రాజధానులు అనే మాయమాటలను, మూడుముక్కలాటలను ప్రారంభించారు. అక్కడికేదో అదే బ్రహ్మాండం అయినట్టుగా అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అంటూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించారు. కర్నూలు చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టు ఏర్పాటు అవుతుందని, అలవిమాలిన హామీలను ప్రకటించారు. అలాంటి ఏర్పాటు జగన్ తానంతట తీసుకోగలిగిన నిర్ణయం కాదని, చీఫ్ జస్టిస్ అనుమతి కూడా ఉండాలనే ప్రాథమిక విషయాల్ని కూడా ఆయన విస్మరించారు. కేవలం మభ్యపెట్టే ప్రకటనలు చేశారు తప్ప.. దేనినీ కార్యరూపం దాల్చేదాకా తీసుకెళ్లలేదు.
ఇప్పుడు ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత.. తాము రాయలసీమకు ఏ మాట ఇచ్చామో దానిని సత్వరం నెరవేర్చడంలో తమ చిత్తశుద్ధిని చూపిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. గతనెల 29వ తేదీన అక్కడ హైకోర్టు ఏర్పాటుకు, న్యాయమూర్తుల నివాసాలకు తదితర అవసరాలకు తగిన భవనాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ కర్నూలు కలెక్టరుకు లేఖ రాశారు. హైకోర్టు తరఫు నుంచి కూడా బెంచ్ ఏర్పాటుకు సీరియస్ కసరత్తు మొదలైందనడానికి అది ఉదాహరణ. ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు చెందిన భవనాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ భవనాన్ని పరిశీలించడానికి ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల బృందం రానున్నారు. మొత్తానికి కొన్ని నెలల వ్యవధిలోనే కర్నూలులో హైకోర్టు భవనం ఏర్పాటు అవుతుందని రాయలసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మభ్య పెట్టకుండానే స్వప్నం నెరవేరుతోంది!
Monday, December 8, 2025
