ఒకే ఒక్కడు.. జగన్మోహనరెడ్డి అతడిని అతిగా నమ్మాడు. కానీ.. ఆ ఒక్కడి దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచుమించుగా పది నియోజకవర్గాలను కోల్పోయింది. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్న తెలుగుదేశం హవాను గమనిస్తోంటే.. పది నియోజకవర్గాలూ దక్కి ఉండకపోవచ్చునేమో అనగలం. కానీ కనీసం ఆరేడు స్థానాలు ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచి ఉండే వారు. ఆఒక్కడు మరెవ్వరో కాదు.. అనిల్ కుమార్ యాదవ్!
గత ఎన్నికలలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలిచి.. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కూడా అయ్యారు. మంత్రిగా ఉంటూ పోలవరం ప్రాజెక్టు పనుల నిర్వహణ గురించి అర్థంపర్థంలేని అడ్డగోలు మాటలు చెబుతూ ప్రభుత్వాన్ని సగం భ్రష్టు పట్టించారు. రెండున్నరేళ్ల తర్వాత.. మంత్రిపదవుల్ని కొత్తటీమ్ కు పంచిపెట్టే క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ అలిగి సైలెంట్ అయిపోయారు. అప్పటిదాకా పాపం.. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి తెలుగుదేశం, ఇతర ప్రత్యర్థుల్ని నానా బూతులు తిడుతూ గడిపాడు. తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి అనిల్ కుమార్ రూపంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు గండం వచ్చింది.
నరసరావుపేట ఎంపీ లావు క్రిష్ణదేవరాయలును గుంటూరుకు మార్చాలని జగన్ అనుకున్నారు. లావు.. ససేమిరా వెళ్లను అన్నారు. అదొక్కటే కాదు. లావును మారిస్తే.. నరసరావుపేట ఎంపీ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లలో తాము గెలవడం కష్టం అని అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ వద్దకెళ్లి మొరపెట్టుకున్నారు. అయినా సరే.. జగన్ వారి మాట వినకుండా.. కులాల లెక్కలు వేసి.. అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. లావు తెదేపాలోకి వెళ్లడం గెలవడం జరిగింది.
ఇదొక్కటే కాకుండా.. తాను ఎంపీగా వెళుతున్నందుకు బదులుగా.. తన నెల్లూరు సిటీ సీటును తన అనుచరుడికి మాత్రమే ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. జగన్ ఆయనకోసం తలొగ్గాల్సి వచ్చింది. అందుకు అలిగిన నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. ఆయన వైసీపీకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద దన్ను కూడా. అలా.. అనిల్ కుమార్ యాదవ్ కోసం జగన్ ఇద్దరు ముఖ్యమైన ఎంపీ అభ్యర్థులను వదులుకున్నారు. ఆ దామాషాలో కనీసం ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండేవారేమో. జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కింద కేబినెట్ ర్యాంకు దక్కేది. ఆ ఒక్కడి దెబ్బకు జగన్ ఆ గౌరవం కూడా లేకుండా దెబ్బతిన్నారని అంతా అనుకుంటున్నారు.
ఆ ఒక్కడి దెబ్బకి వైసీపీకి జరిగిన నష్టమెంత?
Wednesday, December 25, 2024