ఎవరు చేసిన పాపం వారే అనుభవించ పోతారు.. అని పెద్దలు అంటూ ఉంటారు. ఇలా జరిగితే నష్టమేం లేదు. సామెతలో మాదిరిగానే తప్పు చేసిన వారికే శిక్ష పడుతుంది. కానీ.. ఒకరు చేసిన పాపఫలితాన్ని మరొకరు అనుభవించాల్సి వస్తే ఎలా? ఏ సంబంధమూ లేని వారు.. పాత పాపాల భారాన్ని మోయవలసి వస్తే ఎలా? ఇప్పుడు అదే పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో రోగులకు సహాయక చర్యలు, వ్యాధి నివారణ చర్యలు చేపట్టడానికి కేంద్రం నిధులు గ్రాంట్ గా విడుదల చేస్తే.. వాటికి రాష్ట్రప్రభుత్వం తరఫున మ్యాచింగ్ గ్రాంటు జతచేసి ఖర్చు పెట్టాల్సింది బదులుగా.. ఆ డబ్బును కూడా ఇతర పథకాలకు మళ్లించిన జగన్ పరిపాలన వైఫల్యాలు, దుర్మార్గాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. లక్ష్యించిన ప్రయోజనం కోసం ఖర్చు చేయలేదు గనుక, ఆ సొమ్మును తమకు ఇన్నాళ్ల వడ్డీతో సహా వెనక్కు తిరిగి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక.. ఇప్పుడు కూటమి సర్కారులోని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కోవిడ్ కాలంలో రోగులకు మెడికల్ కిట్లు ఇతర మందులు అందించడానికి కేంద్రం బాధ్యతగా వ్యవహరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగానే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గ్రాంటుగా 208 కోట్లను విడుదల చేశారు. కోవిడ్ సహాయక చర్యలు కింద ఖర్చుపెట్టడానికి నిర్ణయించిన మొత్తంలో ఇది కేవలం 60శాతం మాత్రమే. మిగిలిన 40 శాతం అంటే సుమారుగా 139 కోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వమే జతచేసి ఆ పనులకోసం ఖర్చు పెట్టాలి. రాష్ట్ర ఆ పనిచేయనేలేదు.పైగా వచ్చిన డబ్బులను కూడా ఇతర పథకాలకు వాడేసింది. ఇప్పటిదాకా ఆ సొమ్మును ఎలా ఖర్చుచేశారనే నివేదికలు కూడా కేంద్రానికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు కేంద్రం నుంచి తాకీదులు వచ్చాయి. సొమ్ము మొత్తం తిరిగి ఇవ్వాలని అంటున్నారు.
కోవిడ్ సమయంలో దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా జగన్ దానిపట్ల నిర్లక్ష్యం ప్రదర్శించి అభాసుపాలైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకవైపు ప్రతిరోజూ దేశంలో వేల ప్రాణాలు బలవుతున్న సమయంలోనూ దానికి భయపడాల్సిన అవసరమే లేదని, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన వ్యక్తి జగన్. అదే నిర్లక్ష్యాన్ని తన పరిపాలనలో కూడా చూపించారు. కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా దారిమళ్లించి.. రోగ పీడితుల పట్ల తన నిర్లక్ష్యాన్ని అశ్రద్ధను ప్రదర్శించారు. అప్పట్లో మెడికల్ కిట్లు లాంటివి సరఫరా చేసిన వారికి ఇప్పటిదాకా బిల్లుల చెల్లింపు కూడా జరగనేలేదు. వారు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈలోగా కేంద్రం నుంచి తాఖీదులు వచ్చాయి.
జగన్ పరిపాలనలో నిర్లక్ష్యం వహించడం, కోవిడ్ నిధుల్ని దారి మళ్లించడం అనేది ఇప్పటి కూటమి సర్కారుకు గుదిబండగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఆర్థిక చిక్కుల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు తన సంయమనంతో జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతున్నారు. ఇలాంటి సమయంలో 208 కోట్ల రూపాయల కేంద్ర నిధులను వడ్డీతో సహా కట్టవలసి రావడం అంటే పెద్దభారమేనని పలువురు అంటున్నారు.
కూటమి సర్కారుకు గుదిబండగా.. జగన్ అప్పటి దుర్మార్గాలు!
Friday, December 5, 2025
