వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కొనసాగిన కాలంలో.. ఒకవైపు సంక్షేమ పథకాల ముసుగులో డబ్బు పంపిణీలు చేపడుతూనే.. మరొక చేత్తో ప్రజల జేబులు కొల్లగొట్టి ధనాన్ని దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న అనేక అనేక మార్గాలలో వాహనాలకు హరిత పన్ను అనేది కూడా ఒకటి. ఏడేళ్ళ కాలం దాటిన వాహనాలకు అప్పటివరకు 200 రూపాయల వరకు ఫీజు ఉండగా.. వాటిని రకరకాలుగా విడగొట్టి స్లాబులుగా మార్చి గరిష్టంగా 20 వేల వరకు వసూలు చేసేలాగా జగన్ ప్రభుత్వం దోపిడీ ప్రణాళికలను అమలు చేసింది. ప్రధానంగా సరకు రవాణా వాహనాల యజమానులు జగన్ ప్రభుత్వ దోపిడీకి తల్లడిల్లిపోయారు. అనేక పర్యాయాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ వారి విజ్ఞప్తులను ఆలకించిన వారు లేరు. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా హరిత పన్ను విషయంలో పునరాలోచన చేస్తామని.. వాహనదారులకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంది. ఎలాంటి వాహనానికైనా సరే 1500 నుంచి 3000 మించకుండా హరితపన్ను వసూలు చేసే లాగా భారీగా తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహన యజమానులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రజలలో మద్యం తాగే అలవాటు మాన్పిస్తున్నాం అని ముసుగులో లిక్కర్ ధరలను విచ్చలవిడిగా పెంచేసి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏరకంగా మూడున్నర వేల కోట్ల రూపాయలను దోచుకున్నదో అందరికీ తెలుసు. కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ జేబులు కొల్లగొట్టిన సర్కారు వైనం అందరూ గమనించారు. అదే తరహాలో రాష్ట్రంలో పర్యావరణానికి హాని కలిగించే కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గిస్తున్నాం అనే ముసుగులో రవాణా వాహన యజమానుల నడ్డివిరచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద కుట్ర ప్రణాళికనే అమలు చేసింది. ఏడేళ్ల కాల పరిమితి దాటిన సరకు ప్రజా రవాణా వాహనాలకు ఉమ్మడిగా ఏడాదికి ఒకసారి హరిత పన్ను రూపంలో అప్పటివరకు 200 ఫీజు మాత్రమే ఉండింది. జగన్ ప్రభుత్వం అందులో రకరకాల స్లాబు పద్ధతులు తీసుకువచ్చింది. పర్యవసానంగా సరుకు రవాణా వాహనాలకు గరిష్టంగా ఏడాదికి 20 వేల రూపాయల చెల్లించవలసిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని లారీల యజమానులు గొల్లుమన్నారు. ప్రజారవాణా వాహనాలైన బస్సులు, కాబ్ లను నిర్వహించే వారు కూడా ఏడాదికి 4000 నుంచి 6000 రూపాయల హరిత పన్ను చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకసారి పన్నును పెంచేసిన తర్వాత వారు ఎన్ని వేడుకోలు చేసుకున్నప్పటికీ జగన్ సర్కారు మెత్తబడలేదు.
చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల నాయకులు ఎన్నికల ప్రచార సమయంలో వాహన యజమానుల సంఘాల వారు ఈ హరితపన్ను బాదుడు గురించి విన్నవించుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వారికి తప్పకుండా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఇప్పుడు జగన్ వేసిన భారీ బాదుడును పూర్తిగా తగ్గించారు. పొరుగున ఉన్న తెలంగాణ తరహాలోనే 1500 నుంచి గరిష్టంగా 3000 రూపాయలు మించకుండా హరిత పన్ను ఉండేలాగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వా హన యజమానుల నడ్డి విరిచి దోచుకోవడానికి జగన్ సర్కారు కొత్త విధానాలను ప్లాన్ చేస్తే కూటమి సర్కారు వారి సంక్షేమం దిశగా మొత్తాన్ని సవరించడం గమనార్హం.
జగన్ దోపిడీని సరిదిద్దిన కూటమి సర్కార్!
Friday, December 5, 2025
