హైదరాబాదు- సికింద్రాబాదు జంటనగరాలుగా రాజధానిగా ఉన్నందుకే ప్రజలు మురిసిపోతూ ఉండేవాళ్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతితో పాటు అటు ఇటు ఉన్న నగరాలనుకూడా కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి బృహత్ ప్రణాళికలు సాగుతున్నాయి. విజయవాడ- అమరావతి- గుంటూరు మూడింటినీ కలిపి ‘నగరత్రయం’గా గొప్పగా అభివృద్ధి చేయాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. ఈ రాజధాని విశ్వరూపంలోకి మంగళగిరి, తాడేపల్లి కూడా కలిసిపోతాయి. ఈ కొత్త లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా మంత్రి నారాయణ వెల్లడిస్తున్నారు.
ఈ మెగాసిటీకి ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కావాలని, దానికోసం అయిదువేల ఎకరాలు అవసరం అవుతుందని ఆయన అంటున్నారు. ఉన్నత ప్రమాణాఅతో ఈ ఎయిర్ పోర్టు ఏర్పాటు కావాలని అంటున్నారు. అయిదువేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు కోసం భూసమీకరణ ద్వారా స్థలం అందుబాటులోకి తేవాలంటే.. కనీసం 30 వేల ఎకరాలు సేకరించాల్సి వస్తుందని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి మరో 1600 ఎకరాలు కూడా కావాలని చూస్తున్నట్టుగా నారాయణ వెల్లడించారు.
నిజానికి కొత్తగా 44వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుండడం వెనుక అవసరాలు ఇవే ఉన్నట్టుగా తెలుస్తోంది. భూసేకరణ ద్వారా కూడా సేకరించవచ్చు గానీ.. దానివల్ల రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉన్నదని ప్రభుత్వం భావిస్తోంది. సేకరణ ద్వారా స్థలాలు తీసుకుంటే.. కేవలం భూమి విలువకు రెండున్నర రెట్లు మాత్రమే రైతులకు దక్కుతుందని, అలా కాకుండా.. భూ సమీకరణ ద్వారా స్థలాలు తీసుకున్నట్లయితే.. అభివృద్ధి చేసిన తర్వాత.. రైతులకు అందజేసే రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో వారు ఎక్కువగా లాభపడతారని మంత్రి నారాయణ అంటున్నారు. ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా అంటున్నారు.
విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కావాలనుకోవడంపై వస్తున్న కొన్ని విమర్శలను ఆయన కొట్టి పారేశారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న విమానాశ్రయాన్ని చంద్రబాబునాయుడు ప్లాన్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారని, కాని ఇవాళ అది భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఉన్నదని అన్నారు. హైదరాబాదులోని ఎయిర్ పోర్ట్ 550 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆస్థాయి ఎయిర్ పోర్ట్ అవసరం అనే ఉద్దేశంతోనే బాబు సర్కారు అమరావతిలో 5000 ఎకరాలకోసం చూస్తున్నారు.
మొత్తానికి అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలను కూడా కలుపుకుంటూ మెగాసిటీ ప్లాన్ తో సమాంతరంగా అభివృద్ధి చేయడం భారీ ప్లాన్ గా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ సాహసోపేత ప్రయత్నం చేస్తున్నదని ప్రజలు అంటున్నారు.
రాజధాని విశ్వరూపంగా ‘నగరత్రయం’
Sunday, April 27, 2025
