యుద్ధం లేని చోట కత్తి తిప్పడం, సమస్య లేని చోట పరిష్కారానికి ఉద్యమాలు చేయడం చూస్తే ఎలా అనిపిస్తుంది? అలా చేస్తున్న వారికి మతిచలించేమో అనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల వ్యవహారం కూడా అలాగే కనిపిస్తోంది. విశాఖ స్టీలు ప్లాంటు ప్రెవేటీకరణ అనేది ముగిసిపోయిన సమస్య! కాగా, ఇప్పుడు వైసీపీ ఎంపీలు తగుదునమ్మా అంటూ కేంద్రమంత్రి కుమారస్వామిని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చి ప్రెవేటీకరణ చేయవద్దని, విశాఖ ప్లాంటుకు గనులు కేటాయించలని కోరడం జనాలకు నవ్వు తెప్పిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజుల్లో కేంద్రం విశాఖ ఉక్కును ప్రెవేటీకరించడం గురించి ఆలోచించిన సంగతి అందరికీ తెలిసిందే. ఉద్యోగులు పెద్దస్థాయిలో అందోళనలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా వారికి అండగా నిలిచి, విశాఖ ఉక్కు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, వారి కోరిక తీరేలా చూస్తానని మాట ఇచ్చారు. అటు జగన్ సర్కారు విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ వద్దంటూ ఒక్క వినతిపత్రమూ ఇవ్వలేదు, శాసనసభలో తీర్మానమూ చేయలేదు. పైపెచ్చు స్టీల్ ప్లాంటు ఆస్తులను తెగనమ్మేసి.. ప్లాంటును కాపాడాలని జగన్ స్కెచ్ లు వేశారు. వర్కవుట్ కాలేదు.
తీరా ఎన్నికల తర్వాత సీన్ మారింది. మోడీ మళ్లీ గద్దె ఎక్కారు. జగన్ పరాజయంతో మామూలు ఎమ్మెల్యేగా మిగిలారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలోనూ రాజ్యం చేస్తోంది. బిజెపి తెలుగు ఎంపీ ఉక్కు శాఖకు సహాయమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రెవేటీకరణ ఆపడానికి కూటమి నేతలు చక్రం తిప్పారు. సానుకూల స్పందనలు వచ్చాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమను స్వయంగా సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి.. అసలు ప్రెవేటీకరణ చేయబోయేది లేదని విశాఖలోనే ప్రకటించారు. కేంద్రం ఆలాంటి ఆలోచన చేయడం లేదని సహాయమంత్రి శ్రీనివాసవర్మ కూడా ప్రకటించారు. ఇన్ని పరిణామాలు జరుగుతుండగా.. మొన్నటికి మొన్న శాసనమండలిలో ప్రభుత్వం తీర్మానం చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు ఒక సారి అభాసుపాలయ్యారు.
ఇప్పుడు వైసీపీ ఎంపీల వంతు వచ్చింది. ఎంపీ గూడా కాని.. వైవీసుబ్బారెడ్డి నేతృత్వంలో వారంతా వెళ్లి మంత్రి కుమారస్వామికి ప్రెవేటీకరణ వద్దని వినతిపత్రం సమర్పించారు. అసలు ఆ సమస్యే లేదు కదా అంటే.. ఆ సమస్యను పరిష్కరించడానికి ఉదమయమిస్తాం అంటూ డ్రామాలు చేస్తున్న వైసీపీ ఎంపీల ప్రయత్నం అభాసుపాలవుతోంది.