పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి తనకు దక్కకుండా పోతున్నందుకు అలిగి.. ఎన్నికలనే బహిష్కరించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తనకు దక్కకపోయిన పదవి గురించి రాజ్యాంగం దాకా వెళుతున్నారు. తనకు పదిశాతం ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ.. ప్రతిపక్ష నేత హోదా కావాల్సిందే అని మారాం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. అసలు పదిశాతం ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒక అడుగు ముందుకు వేసి.. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేకు మాత్రమే పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నదని చెబుతున్నారు. ఆయన చెబుతున్నంత స్పష్టంగా రాజ్యాంగంలోనే ఉన్నట్లయితే గనుక.. ఏకంగా కోర్టుకే వెళ్లవచ్చు కదా.. ఇలా మీడియా ముందు ప్రగల్భాలు ఎందుకు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి చెందిన సభ్యులకు కేటాయించడం అనేది కేవలం సాంప్రదాయంగా వస్తున్నది మాత్రమే. అందుకు సంబంధించిన రూలేం లేదు. కానీ.. పీఏసీ సభ్యుడు కావాలంటే.. ఎన్నిక కావాలనేది చట్టపరంగా ఉంది. సాధారణంగా ఎన్నిక జరిగే పరిస్థితి వరకు అదనంగా ఎవ్వరూ నామినేషన్లు వేయరు గనుక.. ఎప్పుడూ ఎన్నిక దాకా పరిస్థితి రాలేదు. కానీ ఈసారి ఒక్క సభ్యుడిని గెలిపించుకునే బలం (18 సీట్లు) కూడా వైసీపీకి లేదు. దాంతో 9 సభ్యుల స్థానాలకు ఎన్డీయే కూటమి వారే నామినేషన్లు వేశారు. ఏదో ఒక రభస చేయడమే లక్ష్యం అన్నట్టుగా పదో నామినేషన్ పెద్దిరెడ్డి వేశారు. తీరా ఇప్పుడు ఎన్నికలు బాయ్ కాట్ చేస్తున్నాం అంటున్నారు.
ఇలా తనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని.. 1950 లో ఆర్టికల్ 309(ఐ) అనే సవరణ ద్వారా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారని పెద్దిరెడ్డి అంటున్నారు. ఆయన మాట్లాడినట్టుగా నిజంగానే రాజ్యాంగంలో ఉంటే గనుక.. పెద్దిరెడ్డి నేరుగా హైకోర్టుకే వెళ్లవచ్చు కదా.. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేత హోదా కేసు ఎలా ఉన్నప్పటికీ.. రాజ్యాంగంలో ఆయన చెప్పినంత స్పష్టంగా ఉంటే పెద్దిరెడ్డి కేసు నెగ్గుతారు కదా.. అని ప్రజలు అంటున్నారు. రాజ్యాంగం, ఆర్టికల్ సవరణ లాంటి బుకాయింపు మాటలతో మభ్యపెట్టే బదులు, పీఏసీ ఛైర్మన్ పదవి ఇస్తే ఉద్ధరిస్తాం అని చెప్పే బదులు.. ప్రజలు నమ్మి గెలిపించినందుకు ముందు అసెంబ్లీకి హాజరు కావడం బాధ్యత అని వారు తెలుసుకోవాలని ప్రజలు అంటున్నారు.
ఆర్టికల్స్ చెబుతున్నారే.. కోర్టుకు వెళ్లొచ్చుగా?
Sunday, January 26, 2025