మండలిలో త్వరలో ఎగరనున్న కూటమి జెండా!

Thursday, November 21, 2024
శాసనసభలో 164 స్థానాల బలంతో తిరుగులేని మెజారిటీతో ఉన్న కూటమి ప్రభుత్వం.. శాసన మండలిలో కూడా త్వరలోనే తమ ఆదిక్యాన్ని పొందనున్నదా? జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఆ పార్టీ వారిలో సడలుతున్న విశ్వాసం.. భవిష్యత్తు గురించిన భయం.. కొన్ని తాజా పరిణామాలు గమనిస్తుంటే అదే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. తాజాగా బుధవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీతో పాటు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వెళ్లిపోవడం ఒక కీలక పరిణామం. ఆల్రెడీ శాసనమండలిలోని పలువురు ఎమ్మెల్సీలు ఇప్పటికే తెలుగుదేశం సీనియర్లతో టచ్ లో ఉన్నారని, పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఒక ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో శాసనమండలిలో కూటమి ప్రభుత్వ జెండా ఎగరడానికి ఎక్కువ కాలం అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం 58 స్థానాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం ఎన్డీఏ పార్టీల బలం 10 సీట్లు మాత్రమే. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ నుంచి 19 మంది సభ్యులు పార్టీ మారి వస్తే గనుక కూటమి జెండా ఎగురుతుంది. వారందరూ పార్టీ మారకుండా రాజీనామా చేసినా సరే.. మళ్లీ జరిగే ఉప ఎన్నికలను కూటమి చేజిక్కించుకోవడం సాధ్యమవుతుంది గనుక బలాబలాలు గణనీయంగా మారుతాయి. తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలు దీనిపై ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పోతుల సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఒక కీలక పరిణామం. ఆమె త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్సీల విషయం పక్కనపెడితే వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు కూడా గురువారం వైసీపీకి రాజీనామా చేయనున్నట్లుగా అలాగే తమ రాజ్యసభ పదవులను కూడా వదులుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత కూడా ఒకే కులానికి ప్రాధాన్యం దక్కుతూ రావడం.. వారికితప్ప మరి ఏ ఇతర నాయకుడికి కనీస విలువ లేకుండా పోవడం.. చాలామందిలో అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు.
కొందరి రాజీనామాలు కొందరి పార్టీ ఫిరాయింపుల తర్వాత.. మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనను పదవీచ్యుతుడిని చేయాలని కూటమి పార్టీల నుంచి మండలి చైర్మన్ ఎన్నికయ్యేలా చూడాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మండలి చైర్మన్ మార్పు అంటూ జరిగితే గనుక.. ఆ తరువాత వైసిపి నుంచి కూటమి పార్టీలోకి వలసలు ఇంకా గణనీయంగా ఉంటాయనే అభిప్రాయం కూడా పలువురిలో ఉంది.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలాన్ని చూసి సహించలేక అసలు మండలినే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి.. క్రమంగా అక్కడ తమ పార్టీ బలం పెరిగిన తర్వాత మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు రద్దు లాంటి తప్పు చేయడం లేదు గాని.. మండలిలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles