‘అమరావతి అనేది దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని’ అంటూ అసభ్యంగా నీచపు కారుకూతలు కూసిన జర్నలిస్టు కృష్ణంరాజు ప్రస్తుతం రిమాండులోనే ఉన్నారు. ‘నేనే పాపం ఎరగను.. నా లైవ్ షోకు అతిథిగా వచ్చిన వ్యక్తిచేసిన వ్యాఖ్యలతో నాకేంంటి సంబంధం’ అంటూ అమాయకపు డైలాగులు వల్లించిన ఇంకో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిలు వచ్చి ఉండొచ్చు గాక.. కానీ.. ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఈ టీవీ చర్చపై సూమోటోగా కేసు నమోదు చేసినట్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
అర్చనా మజుందార్ తాజాగా ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె ఇటీవల వివాదాస్పదం అయిన టీవీ చర్చావేదిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మహిళల పరువు, ప్రతిష్ఠలు వారి హుందాతనానికి భంగం కలిగించేలా వ్యాఖ్యానించడం, ప్రవర్తించడం చాలా పెద్ద నేరమని, అలాంటి నేరానికి కారణమైన టీవీ చర్చా కార్యక్రమంపై సూమోటోగా కేసు నమోదు చేసినట్టుగా ఆమె వెల్లడించారు. నిందితులు క్షమాపణ చెప్పినంత మాత్రాన అది సరిపోదని, ఆ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ పరిశీలిస్తోందని అర్చనా మజుందార్ చెప్పారు.
ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ‘నిందితులు క్షమాపణ చెప్పినా సరిపోదు’ అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిబంధనల్ని ప్రస్తావిస్తున్నారు గానీ.. ఈ కేసులో నిందితులు ఏ ఒక్కరూ కూడా ఇప్పటిదాకా క్షమాపణ చెప్పనేలేదు.
కెఎస్సార్ లైవ్ షోలో.. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ నోటిదురుసు నీచపు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వీవీఆర్ కృష్ణంరాజు. ఆయన వివాదం రేగిన రోజునే కుటుంబం సహా పరారైపోయి.. అజ్ఞాతంలోనుంచే ఒక వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. కొన్ని సెక్స్ వర్కర్లు అరెస్టు అయిన కేసుల ఉదాహరణలు చూపించి.. తన వంకర బుద్ధులను ప్రదర్శించారే తప్ప క్షమాపణ చెప్పలేదు.
క్షమాపణ చెప్పవలసిన రెండో వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన కూడా ఆ పని చేయలేదు. కృష్ణంరాజు వెకిలి వ్యాఖ్యలు చేసినప్పుడు.. ఇలా మాట్లాడినందుకు మీమీద ట్రోలింగ్ చేస్తారేమో అంటూ సదరు వ్యక్తిమీద అభిమానం కురిపించారే తప్ప.. అలాంటి వ్యాఖ్యలు తప్పు అనే మాట ఆయన నోటమ్మట రాలేదు. పైగా ఆ వార్తాకథనం తాను కూడా చూశానని వంతపాడారు. పైపెచ్చు తాను అడ్డుకునే ప్రయత్నం చేశానంటూ వంకర మాటలు వల్లించారు. ‘‘తప్పు ఎవరిది అయినప్పటికీ.. తన కార్యక్రమం ద్వారా.. ఒక ప్రాంతపు మహిళలను అవమానించే మాటలు వచ్చినందుకు బాధపడుతున్నాను. క్షమాపణ కోరుతున్నాను’’ అని కొమ్మినేని అని ఉంటే చాలా హుందాగా ఉండేది. ఆ పని జరగలేదు. ఇదే తరహా హుందాతనాన్ని సాక్షి ఛానెల్ కూడా ప్రదర్శించి ఉండాల్సింది. ఎటూ పాపం మొత్తం కృష్ణం రాజు మీదికే నెట్టేశారు గనుక.. తమ చానెల్ ద్వారా.. ఇలాంటి మాటలు వచ్చినందుకు సారీ అని చానెల్ తరఫున ఒక ప్రకటన వచ్చి ఉంటే వారికి ఎంతో మర్యాదగా ఉండేది. ఎవ్వరూ ఆ పనిచేయలేదు.
ప్రస్తుతానికి కొమ్మినేనికి బెయిలు వచ్చి ఉండొచ్చు. కానీ.. జాతీయ మహిళా కమిషన్ కూడా కేసు నమోదు చేసిన తర్వాత.. ఈ కేసులో పాపం చేసిన వారందరూ బహుముఖాలుగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థమవుతోంది.
అసభ్యపు కారుకూతల వ్యవహారం ఇక్కడితో ముగియలేదు!
Monday, December 8, 2025
