చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి పట్టుమని పది దినాలు కూడా పూర్తిగా గడవలేదు. అప్పుడే ఆయన మీద అసంతృప్తిని రేకెత్తించడానికి తప్పుడు ప్రచారంతో ప్రజలలో అస్థిర భావాన్ని మొలకెత్తించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానాతంటాలు పడుతోంది. పోలవరం, అమరావతి వంటి రాష్ట్రం యొక్క దశ దిశ మార్చి వేసే వ్యవహారాలలో చంద్రబాబు నాయుడు క్రమంగా ముందడుగు వేస్తున్నారు. ఏదో ఒక బురద చల్లడం మాత్రమే తమ లక్ష్యంగా బతికే వైయస్సార్ కాంగ్రెస్ దళాలు అర్థం పర్థం లేని విమర్శలు సాగిస్తున్నాయి. చేస్తున్న పనులను గమనించకుండా ‘ముందు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయండి’ అంటూ ప్రగల్భాలు పలకడం వైసిపి వారికి మాత్రమే చెల్లింది. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీలు ఒక్కటొక్కటిగా అమలులోకి రావడం ఒక నెల రోజుల వ్యవధిలోనే సాకారం కానుంది.
ఒక్క నెల రోజులలోగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందుకు వీలుగా అటు తెలంగాణలో, ఇటు బెంగళూరులో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేస్తామని, ఏపీలో కూడా అమల్లోకి తెస్తామని మంత్రి చెబుతున్నారు. అది కార్యరూపం దాలిస్తే గనుక సూపర్ సిక్స్ హామీలలో ఒకటి నెలలోగా రూపు కడుతున్నట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబునాయుడు 2023 మేనెలలో మహానాడు నిర్వహించినప్పుడే.. సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు, అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1500, ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు, వంటి పథకాలను ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్ హామీలు కూడా ఆర్థిక వనరులతో ముడిపడినవే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా వీటిని అమలులోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్ర ఖజానా పరిస్థితి కొత్త పాలకులకు ఇంకా అవగాహనకు రావడం లేదు. అన్ని శాఖల్లో పరిస్థితులను మదింపు చేయానికి, శ్వేతపత్రాలను విడుదల చేయడానికి మంత్రుల కమిటీని కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీలు ఇంకాస్త ఆలస్యం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే రవాణాశాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నెలరోజుల వ్యవధిలోనే అమలులోకి తీసుకువస్తాం అని ప్రకటించడం ప్రజలకు సంతోషాన్నిస్తోంది. మిగిలిన అయిదు హామీలను కూడా ఒక్కటొక్కటిగా అమల్లోకి తెస్తారని అనుకుంటున్నారు.
అదిగదిగో అమలులోకి సూపర్ సిక్స్
Wednesday, January 22, 2025