అసలు నేరం గత ఏడాది జులై 21న జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒకటిరెండు నెలల వ్యవధిలోగానే అన్నమాట. మదనపల్లె సబ్ కలెక్టరు కార్యాలయంలో భూమి రికార్డులకు సంబంధించిన అనేక ఫైళ్లు కాలిబూడిదైపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలే.. ఈ నేరం వెనుక ఉన్నారని అప్పటినుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను బలపరిచే సాక్ష్యాలు ఉన్నాయి. దానికి సంబంధించి కొందరు వ్యక్తులపై కేసులు నమోదు అయ్యాయి. ఒకరిని అరెస్టు చేశారు గానీ.. ఆతర్వాత కేసు అంత చురుగ్గా ముందుకు సాగలేదు. దీంతో ప్రజల్లో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. మదనపల్లె రికార్డుల దహనం కేసు దాదాపుగా మూతపడిపోయిందని, దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే.. మదనపల్లె ఫైల్స్ దహనం కేసు మూతపడిపోలేదని, ఇప్పుడే అసలు సిసలు విచారణ ప్రారంభం కాబోతున్నదని అర్థమవుతుంది. ఎందుకంటే.. ఈ ఫైల్స్ దహనం వెనుక కీలకంగా ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత విశ్వసనీయుడైన అనుచరుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఫైల్స్ దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా ఆయన పై అభియోగాలు ఉన్నాయి. నెలరోజులుగా పరారీలో ఉన్న ఆయన కోసం ఇంటివద్ద సీఐడీ పోలీసులు నిఘా పెట్టినా ఫలితం దక్కలేదు. చివరకు అదే జిల్లాలో రొంపిచెర్లలో తన ఫాంహౌస్ లో ఉన్నారనే సమాచారం తెలుసుకుని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆయన అరెస్టు కూడా నాటకీయంగా జరిగింది. తన ఫాంహౌస్ వద్దనే మాధవరెడ్డి కల్యాణ మండపం నిర్మించి దానిని అద్దెలకు ఇస్తున్నారు. కాగా సీఐడీ డీఎస్సీ కొండయ్యనాయుడు బృందం.. కల్యాణ మండపం అద్దెకు కావాలంటూ ఆయనను అప్రోచ్ అయ్యారు. అలా వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు అని గుర్తించగానే.. మాధవరెడ్డి తన సెల్ ఫోన్లను నీటిలో పారేసే ప్రయత్నం చేయగా.. అలా జరగకుండా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఫైల్స్ దహనం జరిగిన తర్వాత.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుదు మాధవరెడ్డి, పీఏ మునితుకారాం కుట్రదారులను సీఐడీ తేల్చింది. కాల్ డేటా రికార్డుల ద్వారా ఆధారాలూ సేకరించింది. సబ్ కలెక్టరు ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను మాత్రం అరెస్టు చేశారు. అయితే కీలక నిందితులు ఇద్దరూ అప్పటినుంచి పరారీలో ఉన్నారు. పెద్దిరెడ్డి పీఏ మునితుకారాం.. ఫైల్స్ దహనం జరిగిన వెంటనే విదేశాలకు పారిపోయారు. ఆరునెలలు దాటిపోతున్నా.. ఇప్పటిదాకా తిరిగిరాలేదు. మాధవరెడ్డి కొన్నాళ్లు పరారీలో ఉండి.. మళ్లీ స్వగ్రామానికి వచ్చి పోలీసులకు సవాలు విసురుతున్నట్టుగా బహిరంగంగా తిరగడం ప్రారంభించారు.
మరోవైపు ఇటీవల లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. తమ కుటుంబం మీద అన్ని రకాల కేసులు పెడుతున్నారని, ఈ ఫైల్స్ దహనం గురించి కూడా ప్రస్తావించారు. ఏదీ తేల్చలేకపోతున్నారని అన్నారు. ఆ కేసుల్లో అసలు దోషులెవరో నిగ్గుతేల్చే సమయం ఇప్పుడే ఆసన్నం అయింది అని అంతా అనుకుంటున్నారు.
ఆ కేసు మూతపడలేదు.. ఇప్పుడే మొదలవుతోంది!
Friday, December 5, 2025
