సాధారణంగా కడప జిల్లా అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని కొందరు జగన్ అభిమానులు అనుకుంటూ ఉంటారు. అలా ప్రచారం చేస్తుంటారు కూడా. కానీ, 2024 ఎన్నికలు ఇలాంటి అభిప్రాయం తప్పు అని నిరూపించాయి. ఎన్నికలు సక్రమంగా జరిగితే.. కడప జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక నియోజకవర్గాల్లో పతనం కావాల్సిందేనని ఆ ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలో కూడా అదేమాదిరి జరుగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
నిజం చెప్పాలంటే.. ఇప్పటిదాకా ప్రతి సారీ.. పులివెందులలో ఏకగ్రీవంగానే ఎన్నిక జరుగుతోంది. బెదిరిస్తున్నారో ప్రలోభపెడుతున్నారో మొత్తానికి దక్కించుకుంటున్నారు. కానీ.. మొదటిసారిగా 2016లో తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ యాదవ్ నామినేషన్ వేశారు. కానీ.. ఒక హైడ్రామా నడిచింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోయిన తర్వాత.. అతను వైసీపీలో చేరిపోయారు. అంటే తెలుగుదేశానికి అభ్యర్థి కూడా లేకుండాపోయారన్నమాట. అప్పట్లో ఆ మండలంలో ఎనిమిదిన్నర వేల ఓట్లు మాత్రమే ఉండేవి.
జడ్పీటీసీ ఎన్నిక నామమాత్రంగా మారిపోయింది. తెలుగుదేశం అభ్యర్థి ప్రత్యర్థి పార్టీలో చేరిపోవడంతో ఇక.. అంతా సైలెన్స్ అయిపోయారు. ఎన్నికల ప్రచారం కూడా జరగనేలేదు. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నప్పటికీ.. బ్యాలెట్ పేపర్లో అయితే పేర్లు ఉన్నాయి కాబట్టి.. పోలింగ్ జరిగింది. తీరా ఫలితాలు చూస్తే తెలుగుదేశానికి 2600 ఓట్లు లభించాయి. అంటే.. ఒక్క వ్యక్తి అయినా, ఒక్కసారైనా వాకిట్లోకి వచ్చి ఓటు వేయాలని అడగకపోయినప్పటికీ.. సైకిలు గుర్తుకు ఓటేసిన వాళ్లు ఆ మండలంలో అంతమంది ఉన్నారన్నమాట.
ఇప్పుడు పులివెందులలో ఓట్లు పెరిగాయి. పదిన్నర వేల ఓట్లు అయ్యాయి. అప్పటి దామాషా ప్రకారం చూస్తే తెలుగుదేశం బలం కూడా పెరిగి ఉంటుంది. కనీసం మూడున్నర నుంచి 4 వేల ఓట్ల వరకు తెలుగుదేశం స్థిరమైన ఓటు బ్యాంకు ఉంటుందనే అంచనా రాజకీయ వర్గాల్లో ఉంది.
ఇప్పటి ఎన్నికల సంగతికి వస్తే.. వైసీపీ కీలక నాయకులు కొందరు తెలుగుదేశంలో చేరారు. విశ్వనాధరెడ్డి వంటి వారిని వైసీపీ నాయకులు బెదిరించడం కూడా ఆ పార్టీ పరువు తీసింది. వారి ప్రభావం కొన్ని వందల ఓట్లను తెలుగుదేశానికి అనుకూలంగా మార్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో వివేకా కుమార్తె సునీత కు సోదరుడు అయ్యే మరో వ్యక్తి ఇండిపెండెంటుగా నామినేషన్ వేశారు. ఆయన ఎన్నికల్లో బలంగా ప్రచారం చేస్తే.. వైసీపీకి పడే ఓట్లు చీలుతాయనే అభిప్రాయం పలువురిలో ఉంది.
ఈ కారణాల్ని పరిశీలించినప్పుడు.. తెలుగుదేశం పార్టీ పోటీని తేలిగ్గా తీసుకోలేం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ తలరాత ఏకొద్దిగా వికటించినా.. పులివెందుల జడ్పీటీసీ తెలుగుదేశం పరమైనా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు.
పులివెందులలో తెలుగుదేశం కు విజయావకాశం.. ఎలాగంటే..?
Tuesday, December 9, 2025
