ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇప్పుడు రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి వచ్చే నెల ఎన్నిక జరగనుంది. శాసనసభలో తిరుగులేని మెజారిటీ కలిగిఉన్న తెలుగుదేశం పార్టీకే ఈ రెండు మండలి సీట్లు దక్కనున్నాయి. అయితే.. చంద్రబాబునాయుడు తొలి ప్రాధాన్యం ఎవరు? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకోసం విశిష్టమైన త్యాగాలు చేసిన వ్యక్తులు ఎవరు? చంద్రబాబునాయుడు ఎవరికి ఆ పదవులను కట్టబెట్టబోతున్నారు? అనేది సహజంగానే చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేనలతో పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగవలసి వచ్చిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ 31 స్థానాలను వారికి కేటాయించాల్సి వచ్చింది. ఆ దామాషాలో పార్టీ ఇన్చార్జిలుగా ఆయా నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేస్తూ వచ్చిన వారంతా తమ సీటును త్యాగం చేశారు. అలాంటి త్యాగమూర్తులకే ఎమ్మెల్సీలుగా గానీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లోగానీ ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉంది. ఆ పనిచంద్రబాబునాయుడు ఎటూ చేస్తారనే నమ్మకం వారందరికీ కూడా ఉంది. అయితే ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత తొలిసారిగా దక్కిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎవరికి ఇవ్వబోతారు? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశం.
పిఠాపురం నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తూ వచ్చిన వర్మ, పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సీటు జనసేనకు కేటాయించిన తర్వాత.. ఇండిపెండెంటుగా నామినేషన్ వేయడానికి సిద్ధపడిన వర్మను.. చంద్రబాబు పిలిచి బుజ్జగించి.. అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ సీటు అతనికే ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వర్మకు ఒక సీటు తప్పక ఇస్తారనే ప్రచారం పార్టీలో ఉంది.
అలాగే.. పార్టీకోసం త్యాగాలు చేసిన వారిలో ఉండి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరు ప్రముఖంగాచెప్పుకోవాలి. ఆయన 2019 జగన్ హవాలోనే ఉండిలో గెలిచారు. చంద్రబాబు ఆయనకు టికెట్ ప్రకటించేసిన తర్వాత.. ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో.. ఆయనను పక్కకు తప్పించారు. రఘురామక్రిష్ణ రాజుకు ఏదో ఒక సీటు కేటాయించే అవసరం నిమిత్తం.. ఉండి మంతెన రామరాజు తన సిటింగ్ సీటును వదలుకోవాల్సి వచ్చింది. ఆ మేరకు ఆయన త్యాగం పెద్దదే. కాబట్టి రెండో ఎమ్మెల్సీ సీటు రామరాజుకు దక్కుతుందనే ప్రచారం ఉంది.
ఒకవేళ కులసమీకరణలు తెరపైకి వచ్చేట్లయితే ప్రస్తుతానికి రామరాజుకు పదవిని వాయిదా వేస్తారని.. వర్మకు మాత్రం ఎమ్మెల్సీ తథ్యం అని ప్రచారం జరుగుతోంది.