సోషల్ మీడియాను వాడుకుంటూ నిర్మాణాత్మక విమర్శలు ఎలా ఉండాలో.. అందరికీ ఒకర స్టాండర్డ్ సెట్ చేసి చూపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. సోషల్ మీడియాను ప్రపంచంలో అనేక రంగాల్లో అభివృద్ధికోసం విస్తృతంగా వాడుకుంటున్నారు. కేవలం రాజకీయాల్లో మాత్రమే ఈ మీడియాను విషం కక్కడానికి వాడుకుంటున్నారు. అయితే పాలక పక్షాలు కూడా కఠినంగా వ్యవహరిస్తుండడంతో.. విషం కక్కేవారికి కటకటాలు కూడా తప్పడం లేదు. అయితే ఇదే సోషల్ మీడియాను రాజకీయంగా క్రియాశీలంగా నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఆ విషయం నిరూపించాలని ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా అనుకుంటోంది.
ప్రధానంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విషయంలో ఫస్ట్ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని వారి వారి నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అక్కడి ప్రజలు ఏ నమ్మకం పెట్టుకుని, వైసీపీ నేతలను ఎమ్మెల్యేగా గెలిపించారో.. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడాన్ని టీడీపీ సోషల్ మీడియా ప్రస్తావించనుంది.
తమ తమ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని చైతన్యపరచనుంది. ఎమ్మెల్యే అంటేనే శాసనస సభకు హాజరై తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడం ప్రభుత్వం ద్వారా పరిష్కారాలు రాబట్టడం అనేది వారి ప్రాథమిక బాధ్యత. ప్రభుత్వం ఒక కొత్త బిల్లు తేదలచుకున్నప్పుడు.. ఆ బిల్లు పట్ల తమ అభిప్రాయాలు, అసంతృప్తి వెలిబుచ్చడం కూడా వారి విధి. కనీసం తమ అభిప్రాయాలను రికార్డు చేయడం వారి బాధ్యత. అవేమీ చేయకుండా.. ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. నెలనెలా లక్షల్లో జీతాలు తీసుకుంటూ.. కనీసం సభకు కూడా వెళ్లకుండా తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేస్తే ఎలా అనే ఆలోచన ప్రజల్లో కలిగించడానికి టీడీపీ సోషల్ మీడియా ప్రయత్నించనుంది.
అయినా సోషల్ మీడియాను రాజకీయాల్లో ఈరకమైన విమర్శలకు వాడుకోవాలి గానీ.. వ్యక్తిగతంగా బురద చల్లుతూంటే కటకటాలు తప్పవని పలువురు అంటున్నారు.
ఆ 11 చోట్ల హోరెత్తించనున్న టీడీపీ సోషల్ మీడియా!
Wednesday, November 13, 2024