2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా జనవరి 27 నుండి పాదయాత్ర జరుపుతున్నట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. దానితో ఆయనతో సన్నిహితులైన పలువురు యువనేతలలో ఉత్సాహం కనిపిస్తున్నా, ఆ పార్టీ సీనియర్ నేతలలో మాత్రం ఖంగారు కనిపిస్తున్నది.
2019లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడానికి ప్రధాన కారకులలో లోకేష్ వ్యవహార శైలి ఒకటని ఇప్పటికి పార్టీలో చాలామంది సీనియర్లు భావిస్తున్నారు. ఆయన మంత్రివర్గంలో చేరడం పార్టీకి ఎంతో నష్టం కలిగించిందని భావిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని పక్కన పడవేసి, తన చుట్టూ చేరే భజనపరులను చేరదీసి పార్టీలో కల్లోలం సృష్టించారని చెప్పుకొంటున్నారు.
వైసిపి నుండి పెద్దఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించడంతో పాటు, వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ అపఖ్యాతిపాలు కావడానికి సహితం లోకేష్ నే కారణంగా భావిస్తున్నారు. టీడీపీలోని సీనియర్లు చాలామంది ఆయన వద్దకు వచ్చి `సర్’ అంటూ వినయం ప్రదర్శించలేక పోతున్నారు. దానితో వైసిపి నుండి వచ్చే వారయితే `సర్’ అంటూ, ఆయన కోటరీ లో చేరిపోతారని ప్రోత్సహించారు.
అయితే వైసిపి నుండి వచ్చిన వారు స్థానికంగా గల టీడీపీ నేతలతో కలసి పనిచేయలేక పోవడం, పార్టీ చోటా గ్రూపులు ఏర్పడటం కారణంగా ఎన్నికలలో ఎంతో నష్టం కలిగించింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు సహితం పార్టీ సారధ్యంలో కాకుండా ఆయన `కోటరీ’ సారధ్యంలో జరుగుతూ ఉండడం పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నది.
ఒక వంక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో పరిస్థితులను బేరీజు వేసుకొంటూ, సమర్థులైన అభ్యర్థుల కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటె, లోకేష్ ఇప్పటికే స్థానికంగా గల కీలకమైన టిడిపి నేతలకు వ్యతిరేకంగా తనకు సన్నిహితంగా ఉండే యువ నేతలను ప్రోత్సహిస్తూ ఉండడం, వచ్చే ఎన్నికలలో వారిదే సీట్ అనే సంకేతం ఇస్తూ ఉండడంతో టిడిపిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటువంటి సమస్యలు వస్తాయనే లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల చంద్రబాబు నాయుడుతో పాటు, నందమూరి బాలకృష్ణ సహితం చివరి వరకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. “కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి. రాజకీయాలలో ఆటుపోట్లకు గురికావాలి. అలా కాకుండా ఇప్పుడే మంత్రి అయితే అల్లరి పాలవుతాడు” అంటూ బాలకృష్ణ హెచ్చరించారు కూడా.
అయితే, భార్య, కోడలు నుండి వచ్చిన వత్తిడులకు తట్టుకోలేక మంత్రివర్గంలో కొడుకుకు స్థానం కల్పించిన చంద్రబాబునాయుడు రాజకీయంగా `భారీ మూల్యం’ చెల్లించుకోవాల్సి వచ్చినదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై చెలరేగిన అవినీతి ఆరోపణలు అన్ని లోకేష్ కు సన్నిహితులకు సంబంధించినవే కావడం ఈ సందర్భంగా గమనార్హం.
ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా కూడా పార్టీలో అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేయకుండా ఒంటెత్తు పోకడలు అనుసరించే అవకాశం ఉన్నదని కొందరు సీనియర్లు చంద్రబాబు నాయుడు వద్ద తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూల్ జిల్లా పర్యటన సందర్భంగా వచ్చే ఎన్నికలలో సీటు ఇవ్వకపోవచ్చని ఆయన స్పష్టంగా సంకేతం ఇచ్చిన ఓ యువనేత ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లలో కీలకంగా కనిపిస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం.
చంద్రబాబు నాయుడు వయస్సు ఇప్పటికే 72 ఏళ్ళు కావడం, 2024లో గెలుపొంది ముఖ్యమంత్రి కాగలిగిన ఆయన వయస్సు 74 ఏళ్లకు చేరుకొంటుంది. అందుకనే 2029 ఎన్నికలకు సారధ్యం వహించడం కష్టం కావచ్చని సర్వత్రా భావిస్తున్నారు. అందుకనే తనకు “ఇవే చివరి ఎన్నికలు” అన్న సంకేతం కర్నూల్ జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు ఇచ్చారు.
చంద్రబాబు తర్వాత లోకేష్ సారధ్యంలో టిడిపి మనుగడ గురించి సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్న దృష్ట్యా తాను `ప్రజా నాయుడునే’ అని నిరూపించు కోవడం కోసం లోకేష్ ఇప్పుడు పాదయాత్ర చేపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగలిగిన, పార్టీలో – ప్రభుత్వంలో పూర్తిగా తానే నిర్ణయాధికారిగా మారేందుకు సహితం లోకేష్ భూమిక ఏర్పాటు చేసుకుంటున్నట్లు పలువురు భావిస్తున్నారు.
అందుకనే లోకేష్ చేపట్టే పాదయాత్ర వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుపుకు దారి తీస్తుందా? లేదా పార్టీలో కల్లోల పరిస్థితులు సృష్టిస్తుందా? అన్న ఆందోళనలు పలు వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.