ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య 2014 తరహాలో పొత్తులు కుదురుతాయనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. ‘జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను’ అని జనసేన అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో దృఢంగానే ప్రకటించారు. అలాగే భారతీయ జనతా పార్టీతో కూడా- మూడు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం గురించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం తెలియజేశారు. బిజెపి కూడా చంద్రబాబుతో పొత్తుకు సుముఖంగానే ఉన్నట్టు ఇటీవల పరిణామాలు నిరూపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు బంధం ఇంకా ఏర్పడలేదు కానీ.. ఒకరికొకరు సహకరించుకునే స్నేహం బలపడుతున్నట్లుగా ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది.
ఎందుకంటే, ఒక పార్టీ మీద- పాలకపక్షం దుర్మార్గాలకు దాడులకు అరాచకత్వానికి పాల్పడితే కనుక ఇప్పుడు తతిమ్మా రెండు పార్టీలు కూడా వారికి అండగా నిలుస్తున్నాయి. వారి తరఫున తమ గళం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పోకడలను నిరసిస్తున్నాయి. ఈ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువగా ఈ మూడు పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవడం ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2800 కిలోమీటర్లకు పైబడి సాగుతున్న ఈ పాదయాత్ర గతంలో జగన్మోహన్ రెడ్డి సాధించిన రికార్డులను బద్దలు చేసే రీతిగా ముందుకు వెళుతోంది. అయితే నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మీద వైసిపి దళాలు రాళ్లతో దాడులు చేయడం పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తరచుగా జరుగుతుంది., అలాగే పోలీసులు తిరిగి తెలుగుదేశం వారి మీద కేసులు బనాయించి తీసుకువెళ్లడం కూడా జరుగుతోంది.
ఈ అరాచక పోకడలను జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, భారతీయ జనతా పార్టీ తరఫున సత్య కుమార్ ఖండిస్తున్నారు. వేర్వేరు సందర్భాలలో వీరు మాట్లాడుతూ ప్రతిపక్షాల సభలో కార్యక్రమాలలో అల్లర్లు సృష్టించడానికి వైసిపి దళాలు తెగబడుతున్నాయంటూ విమర్శిస్తున్నారు. ఒక పార్టీ మీద ప్రతికూల చర్యలు తీసుకున్నప్పుడు వ్యతిరేకత అందరి నుంచి సమానంగా వ్యక్తం అయితే గనుక పాలక పక్షం వారు దూకుడు తగ్గిస్తారని అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. అలాగే.. ఒకరికొకరు సహకరించుకోవడం అనేది.. రేపు కుదరబోయే పొత్తులకు సంకేతాలు అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.