తెలుగుదేశం పార్టీ తొలినుంచి ప్రజల బాటనే అనుసరిస్తోంది. ప్రజల కోసమే పనిచేస్తోంది. ఇప్పుడు కూడా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి.. ప్రజల నోళ్లలో ఏ పదాలైతే కొన్నేళ్లుగా నానుతున్నాయో.. ఆ పదాలను వచ్చే ఎన్నికల సమరానికి తమ నినాదంగా మార్చుకుని శంఖారావం పూరించింది. హ్యాష్ ట్యాగ్ ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో.. సరికొత్త సమరానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజలను చైతన్య పరిచే పోరాటాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోవడం, ఎటు చూసినా భూకబ్జాలు, దందాలు, అధ్వానంగా ఉన్న రోడ్లు ఇవన్నీ చూసి.. ప్రజలు ప్రతిరోజూ ప్రతిచోటా.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని ఏడ్చే వాతావరణం ఏర్పడుతోంది. ఆ ప్రజల బాధనే ప్రతిబింబించేలా పార్టీ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ డిజైన్ చేసిన కార్యక్రమాన్ని పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రాబిన్ శర్మ తొలుత ‘ఇదేం ఖర్మ’ అని కార్యక్రమానికి టైటిల్ పెట్టగా.. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడి సూచన మేరకు ’ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ అని మార్చారు. ఈ కార్యక్రమం డిసెంబరు 1న ప్రారంభం అవుతుంది. 45 రోజుల పాటు కొనసాగుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు 45 రోజుల పాటు ముమ్మరంగా ప్రజల్లో తిరగాలి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 52 లక్షల కుటుంబాలను కలవాలి. వారికి పార్టీ అందించిన కిట్లు పంపిణీ చేయాలి. పార్టీ నిర్దేశించిన ఒక ప్రశ్నపత్రంలో వివరాలు తీసుకోవాలి. ఆ పత్రం ద్వారా స్థానిక సమస్యలను సేకరించే అవకాశం ఉంది. భర్తీచేసిన ప్రశ్నపత్రాన్ని ఫోటోతీసి పార్టీ ఆఫీసుకు పంపాలి. ఇలా సేకరించిన సమస్యలనే క్రోడీకరిస్తూ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తయారుచేస్తుంది.
జగన్ ప్రభుత్వం తాము బీభత్సంగా సంక్షేమం చేపడుతున్నట్టుగా.. కేవలం డబ్బులు పంపిణీ చేసి చేతులు దులుపుకుని, డప్పు కొట్టుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వాతావరణం, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో.. ఈ ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఈ సమస్యలను బయటపెడుతూనే ఉంటారు గనుక.. వైసీపీ సర్కారు ఎంతగా బుకాయిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎన్ని సమస్యలు విలయతాండవం చేస్తున్నాయో ప్రజలకు తెలియజెెప్పడం కూడా కుదురుతుంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే పదం జనం నోట నానుతుంది. ఈ కార్యక్రమంతో పూర్వరంగం సిద్ధం చేసి.. ఆ తర్వాత.. నిర్దిష్టమైన కార్యచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చంద్రబాబునాయుడు తలపోస్తున్నట్లుగా తెలుస్తోంది.