ఎన్నికల సమయంలో ఓటరును దేవుడు అని రాజకీయ నాయకులు అని అంటుంటారు. పోలింగ్ పర్వం పూర్తయ్యేవరకు ప్రతి ఓటరునూ దేవుడిలాగానే చూసుకుంటారు. దేవుడు ఏం అడిగితే అది బిర్యానీలు, లిక్కరు సీసాలు నైవేద్యం పెట్టడానికి పూనుకుంటారు. దేవుడి హుండీలో ఓటుకు నోటు డబ్బులు కూడా వేస్తారు. ఇంకా చెప్పాలంటే ఓటరు దేవుళ్ల కాళ్లు మొక్కుతారు. పేదల బస్తీల్లో మురికిగా ఉండే పిల్లలను చంకకెత్తుకుని వారి మూతితుడుస్తారు.. ముడ్డి కూడా కడుగుతారు.. ఇవన్నీ మనం ప్రచారపర్వంలో చూస్తూనే ఉంటాం. కానీ పోలింగ్ ముగియక ముందే ఓటరు దేవుడి మీద చెయ్యి చేసుకుని కొట్టిన నాయకుడిని, తన అనుచరులతో చితక్కొట్టించే అభ్యర్థిని మనం ఎన్నడైనా చూశామా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని.. అలాంటి చిన్నెలన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, పోలింగ్ కేంద్రంలో గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు ను కొట్టడం, అతడి చేతి దెబ్బ తినడం, అనుచరులతో దారుణంగా కొట్టించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
అయితే ఇలాంటి ఎపిసోడ్ మీద.. తన ప్రతి అభ్యర్థినీ తమ్ముడిగా, సౌమ్యుడిగా అభివర్ణించిన జగన్మోహన్ రెడ్డి స్పందన ఏమిటనేది ఇప్పుడు చర్చ! అన్నాబత్తుని శివకుమార్ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటు అనడంలో సందేహం లేదు. గొట్టిముక్కల సుధాకర్ అనే బెంగుళూరులో స్థిరపడిన ఓటరు బూత్ కు తాగివచ్చాడని, అక్కడ అందరినీ ఇబ్బందిపెడుతున్నాడని, తన ఫ్యామిలీ ఎదుటే దూషించాడని అందుకే కొట్టానని శివకుమార్ అంటున్నారు. అయితే ఆయన అనుచరగూండాల చేతిలో దారుణంగా దెబ్బలు తిని ఆస్పత్రిలో చేరిన సుధాకర్ వాదన కూడా సబబుగానే ఉంది. ‘నేను ఆస్పత్రిలోనే ఉన్నాను. తాగివచ్చానో లేదో ఇక్కడే రక్తపరీక్షలు చేయించండి. తాగినట్టు నిర్ధరణ అయితే ఏ శిక్షకైనా సిద్ధమే’ అని సవాలు విసురుతున్నారు. ఈ మాటలతో సాధారణ ప్రజల్లో అతని మీద జాలి, వైసీపీ ఎమ్మెల్యే దూకుడు మీద ఆగ్రహం కలగడం సహజం.
ఇలాంటి పరువు తక్కువ వ్యవహారాల మీద స్పందించాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డికి లేదా అనేది ప్రశ్న! ఓటరు పట్ల అలా స్పందించినందుకు అన్నాబత్తుని శివకుమార్ కు జగన్ కనీసం ఫోను చేసి మందలించినట్టు అయినా పత్రికల్లో వార్త రాకపోతే.. జగన్ పట్ల కూడా ప్రజలకు గౌరవం సన్నగిల్లుతుంది. తమ పార్టీ వారైనా సరే తప్పు చేస్తే చర్య తీసుకుంటాను అనే భావన ఆయన ప్రజల్లోకి పంపగలిగినప్పుడే.. ఆయనకైనా మర్యాద. అసలే సొంత పార్టీ వాళ్లు ఎంత అరాచకాలు చేసినా.. జగన్ చర్య తీసుకున్న దాఖలాలు గత అయిదేళ్లలో లేవు. కనీసం తిరిగి ప్రతిపక్షంలో కూర్చోబోతున్న ఈ సమయంలోనైనా ప్రజలను గౌరవించడం ద్వారా వారి అభిమానాన్ని పొందితే ఆయనకే మంచిది. శివకుమార్ పై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని, ఎటూ ఆయన గెలవబోయేది లేదు గనుక పార్టీ నుంచి సస్పెండ్ చేసినా పర్లేదని, కొన్నాళ్ల తర్వాత మళ్లీచేర్చుకోవచ్చునని పార్టీ వాళ్లే అభిప్రాయపడుతున్నారు.
సస్పెండ్ చేయండి జగన్.. పరువైనా దక్కుతుంది!
Wednesday, January 22, 2025