సాక్షి టీవీ ఛానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదారంగా, దయతో వ్యవహరించింది. ఆయనకు బెయిలు ఇచ్చే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో పేర్కొన్నారు. అభ్యంతరమే లేకపోవడంతో.. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను పూర్తిస్థాయి బెయిలుగా ఖరారుచేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ సందర్భంగా యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆయన వ్యవహార సరళి మీద కొన్ని అక్షింతలు వేసి, ఇలాంటి షోలు నిర్వహించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం గురించి సలహాలు చెప్పింది సుప్రీం కోర్టు.
జర్నలిస్టు కృష్ణంరాజును తన లైవ్ షో కార్యక్రమానికి అతిథిగా పిలిచి.. ఆయన అమరావతిని వేశ్యల రాజధాని అని దూషిస్తూ నీ వ్యాఖ్యలు చేస్తే.. వెకిలి నవ్వులతో సమర్థించిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు. అప్పట్లో అరెస్టు అయిన కొమ్మినేనికి సుప్రీం కోర్టే జూన్ 13న మధ్యంతర బెయిలు ఇచ్చింది. దానిని ఇప్పుడు పూర్తిస్థాయి బెయిలుగా మార్చారు.
ఇందుకోసం వేసిన పిటిషన్లోనే కొమ్మినేని తన షోల విషయంలో కొంత ఓవరాక్షన్ చేయడానికి ప్రయత్నించారు గానీ.. కోర్టు మెట్టు దిగలేదు, నిబంధనలు సడలించలేదు. ‘పిటిషనర్ యాంకర్ గా నిర్వహించే చర్చల్లో పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయరాదు, ఇతరులు చేయడాన్ని అనుమతించరాదు’ అని గతంలో సుప్రీం విధించిన నిబంధనను సవరించాలని కొమ్మినేని న్యాయవాది సిద్ధార్థ దవే కోరారు. ‘వ్యాఖ్యలు చేసేవారిని యాంకర్ అడ్డుకోలేరు’ అని వాదించారు.
అయితే సుప్రీం తమ పట్టు సడలించలేదు. ‘మీరు అలాంటి వ్యాఖ్యలను మ్యూట్ చేయండి, మీ అతిథులను అప్రమత్తం చేయండి. మీ చేతిలో రిమోట్ పెట్టుకోండి’ అంటూ సలహా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరువునష్టం కలిగించే వ్యాఖ్యలను అనెుమతించరాదని సుప్రీం న్యాయమూర్తులు తేల్చేశారు.
నిజానికి వివాదాస్పద కృష్ణం రాజు వ్యాఖ్యల సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు వాటిని అడ్డుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు సరికదా.. వాటిని సమర్థించేలా కొన్ని మాటలు అన్నారు. అమరావతి వేశ్యల రాజధాని అని ఆయన అంటే, అలాంటి అభిప్రాయం కలిగించే కథనాలు తాను కూడా పేపర్లలో చూశానన్నారు. పైగా ఆ వ్యాఖ్యలు చేసినందుకు కృష్ణంరాజును అందరూ ట్రోల్ చేస్తారేమో అని కొమ్మినేని, జర్నలిస్టు కృష్ణంరాజు మీద సానుభూతి చూపించారు. ఆ వ్యాఖ్యలు రాజేసిన మంటల్లో రాష్ట్రం అట్టుడికిన తర్వాత, పోలీసు కేసులు నమోదు అయిన తర్వాత కూడా.. కొమ్మినేని తన యజమానులు వైఎస్ జగన్ కు, వైఎస్ భారతికి క్షమాపణలు చెప్పారే తప్ప.. అవమానానికి గురై ఆవేదన చెందుతున్న రాష్ట్ర మహిళలకు ఆయన సారీ కూడా చెప్పలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు నిర్దేశాలతో కొమ్మినేని షోలో వెకిలి వ్యాఖ్యలు తగ్గుతాయని ఆశించవచ్చునని పలువురు భావిస్తున్నారు.
అక్షింతలు, సలహాలుతోపాటు కొమ్మినేనికి బెయిలు ఇచ్చిన సుప్రీం!
Friday, December 5, 2025
