ఘట్టమనేని శివరామకృష్ణగా చాలా మందికి తెలియపోవచ్చు గాని, సూపర్ స్టార్ కృష్ణ అనగానే ఆ పేరు ఒక ప్రభంజనం. 1943 మే 31వ తారీఖున పుట్టిన కృష్ణ, 1964-65 వ సంవత్సరంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనెమనసులు చిత్రంతో కధానాయకుడిగా తెలుగు చలనచిత్రసీమలో అడుగుపెట్టి, 1966వ సంవత్సరంలో సుందరిలాల్ నహతా-డూండి నిర్మాణ సారధ్యంలో, ఎం. మల్లికార్జునరావు దర్శకత్వంలో హాలీవుడ్విలో విడుదలై అపూర్వ విజయం సాధించిన డాక్టర్ నో ప్రేరణగా తెలుగులో గూఢచారి 116 సినిమాతో తెలుగులో డిటెక్టివ్ సినిమాలతో పాటు తన సినిమా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. నటుడిగానే కాకుండా, తెలుగు సినిమా రంగానికి సంబందించిన అన్ని శాఖల విషయంలోనూ వ్యాపారపరంగా పట్టు సాధించి, 1971వ ,1970వ సంవత్సరంలో తన పెద్ద కూతురు పద్మజ పేరున స్థాపించిన పద్మాలయ ఫిలిమ్స్ 2వ చిత్రముగా, తన తమ్ములు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని హనుమంతరావు నిర్మాతలుగా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో, కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, జ్యోతిలక్ష్మి, ముఖ్యపాత్రల్లో నటించిన భారతదేశంలోనే తొలి కౌబాయ్ నేపథ్యంలోని సినిమాగా పేరుతెచ్చుకున్న, మోసగాళ్ళకు మోసగాడు చిత్రం ఒక అపూర్వ చిత్రముగా నిలచిపోయింది. ఆ చిత్రం విడుదల నాటికి, కృష్ణకు తెలుగు చిత్రసీమతో కేవలం 7 సంవత్సరముల అనుభవం మాత్రమే ఉంది. అతనిలోని సినీ వ్యాపార దక్షతకు ఇది ఒక నిదర్శనం. 1974వ సంవత్సరంలో నిర్మించిన అల్లూరి సీతారామారాజు చిత్రం కృష్ణను ఒక అభిరుచి కలిగిన నిర్మాతగా నిలబెట్టడమే కాకుండా, విఖ్యత నటుడు, పద్మశ్రీ ఎన్.టి.రామారావుగారి ప్రశంసలను పొందటమే కాకుండా, తెలుగువీర లేవరా దీక్ష బూని సాగారా పాట, భారత ప్రభుత్వంచే 1974వ సంవత్సరమునకు ఉత్తమ సినీ గేయముగా గుర్తించబడింది.
కేవలం నటుడిగానే కాకుండా, ఒక ప్రయోగకర్తగాను కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుస్థిరస్థానాన్ని సంపాదించారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడిగా అడుగు పెట్టిన కృష్ణ అంచలంచలుగా ఎదిగి, ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, పంపిణీదారుగా, సినిమా ప్రదర్శనదారుగానే కాకుండా, తెలుగు సినిమా పరిశ్రమలో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటి చిత్రాలను, కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టి తెలుగూ చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో తోలి విజయాలను సాధించిన ఘనత, కృష్ణ స్వంతం.
అతనిలోని ప్రతిభకు, అకుంఠిత దీక్షకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం మోసగాళ్ళకు మోసగాడు చిత్రం. ఆ చిత్రం నిర్మించే నాటికీ, తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అప్పటికి కేవలం 7 సంవత్సరములు మాత్రమే పూర్తిచేశారు. అయినా, ధైర్యముగా రాజస్థాన్లో ఎడారులు, బికనీర్ కోట, పంజాబ్ లోని సట్లెజ్ నది తీరం, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాకిస్తాన్-చైనా సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారి ఆ రోజులలో ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకెళ్లడం ఒక రికార్డు.
అదే స్పూర్తితో, అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు ఎన్.టి.రామారావు, స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. అయినా మొక్కవోని కార్యదీక్షతో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించారు.
దాదాపు 340 పైగా చలన చిత్రాలలో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఘట్టమనేని కృష్ణను ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) తో సత్కరించారు.
ఆబాల గోపాలాన్ని 4 దశాబ్దాలకు పైగా అలరించిన కృష్ణ, 2019వ సంవత్సరంలో రెండవ భార్య విజయనిర్మల, 2022వ సంవత్సరంలో పెద్ద కుమారుడు రమేష్ బాబు, పెద్దభార్య ఇందిర మరణాలతో కలత చెందిన కృష్ణ, నవంబర్ 15, 2022 తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కారణం చేత, తన 80వ సంవత్సరంలో మరణించారు.
60వ దశకంలో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి, 2022వ సంవత్సరంలో నలుపు-తెలుపు సినిమా రంగంలో మిగిలి ఉన్న అతికొద్ది నటులలో మిగిలిన కృష్ణ, కృష్ణంరాజు కేవలం 2 నెలల వ్యవధిలోనే కన్నుమూయడం యాదృచ్చికమే!