జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగినంత కాలమూ.. తిరుమల దేవుడి విషయంలో ఎన్ని లోపాలు జరిగినా ఆయన పెదవి విప్పలేదు. లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగుచూసినప్పుడు కనీసం కౌంటర్లు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ప్రజలు ఎన్నుకున్న ఒక ఎంపీగా కంటె, జగన్ భృత్యుడిగా ఉండడమే పెద్ద పదవి అనుకున్నట్టుగా ఆయన వ్యవహరించారు. ఇప్పటికీ అదే ధోరణి కనబరుస్తున్నారు. జగన్ వ్యతిరేక హవా ఆ పార్టీని మట్టుపెట్టిన సమయంలో కూడా రెండోసారి ఎంపీగా గెలిచిన గురుమూర్తి.. జగన్ కళ్లలో ఆనందం చూడడానికే ఇప్పటికీ పరితపిస్తున్నారు.
తిరుపతి ఎంపీ గురుమూర్తి తాజాగా ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఒక లేఖ రాశారు. తిరుమల గిరులలో భద్రత వైఫల్యాల గురించి ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీని గనుక.. కేంద్రానికి మాత్రమే లేఖ రాయాలి అని, తన రేంజి హస్తినాపురం అని ఆయన అనుకున్నారో లేదా, రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాయడం తనకు చిన్నతనంగా ఉంటుందని భావించారో తెలియదు గానీ.. మొత్తానికి రకరకాల అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు.
వైకుంఠద్వార దర్శనానికి టికెట్లు ఇచ్చే సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం దగ్గరినుంచి అనేక అంశాలు ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే ఎలాంటి రుజువుల ప్రస్తావన లేని నాన్ వెజ్ వంటకాలను, గంజాయి ఆల్కహాల్ లను తిరుమలకు తీసుకువెళుతున్నారనే పసలేని ఆరోపణలు కూడా చేశారు. పాపవినాశనంలో బోట్లు తో అటవీశాఖ సిబ్బంది తిరగడాన్ని అతిపెద్ద రాద్ధాంతం చేయడానికి వైసీపీ నానా పాట్లు పడుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఇందుకోసం రోజూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంపీ గురుమూర్తి కూడా అదేపనిలో ఉన్నారు. ఆ అంశాన్ని కూడా కేంద్రానికి రాసిన పితూరీలో పేర్కొన్నారు.
అన్నింటికంటె హైలైట్ ఏంటంటే.. మతిస్థిమితం లేని ముస్లిం వ్యక్తి బైక్ పై తిరుమలకు చేరుకున్నాడని, సమన్వయంలోపం భద్రత వైఫల్యాలు ఉన్నాయని ఆరోపించడం. అసలు ముస్లిం అయితే తిరుమలకు రానేకూడదని ఎంపీ భావిస్తున్నారో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే ఎంపీ గురుమూర్తి క్రిస్టియను అయిన జగన్మోహన్ రెడ్డి తిరుమల ఆలయ ఆగమ నిబంధనలకు విరుద్ధంగా డిక్లరేషన్ లో సంతకం పెట్టకుండా దర్శనాలకు వెళ్లినప్పుడు.. ఆయన సంతకం పెట్టాల్సిందేనని అందరూ డిమాండ్ చేసినప్పటికీ జగన్ ఖాతరు చేయలేదు. తిరుమల ఆలయ నిబంధనలకు జరుగుతున్న ద్రోహం అప్పట్లో ఈ ఎంపీ గురుమూర్తికి కనిపించలేదా? అనేది భక్తుల ప్రశ్న. వాస్తవాలతో నిమిత్తం లేకుండా, మానవ తప్పిదాలు పొరబాట్లుగా జరిగే కొన్ని వ్యవహారాలను కూడా గోరంతలు కొండంతలుగా చేసి ప్రభుత్వం మీద బురద చల్లడానికి అందరు వైసీపీ నాయకుల్లాగానే ఎంపీ గురుమూర్తి కూడా ఆరాటపడుతున్నారా? లేదా.. స్క్రిప్టు తయారై తాడేపల్లి నుంచి వస్తున్న కంటెంట్ కింద తాను సంతకాలు పెట్టి ఫిర్యాదులు కేంద్రానికి పంపుతున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
తిరుమల దేవుడిపై హఠాత్తుగా ప్రేమ పొంగిందే!
Wednesday, April 9, 2025
