సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లికి చెందిన రమేష్ అనే వ్యక్తి.. ఒక మామూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అతనికి స్మార్ట్ ఫోను కూడా ఉంది. జగన్ అంటే అభిమానం ఉంది. పార్టీ పెద్దలు చెప్పే రెచ్చగొట్టుడు మాటలను ఫాలో కావాలనే కోరిక ఉంది. రాజకీయం మీద మామూలు వ్యక్తుల కంటె ఎక్కువ పిచ్చి ఉన్నది గనుక, అంతో ఇంతో ప్రాపంచిక జ్ఞానం కూడా ఉన్నట్టే. ఎలాంటి పనులకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో బహుశా కనీస అవగాహన ఉండే వ్యక్తి కావొచ్చు. అలాంటి రమేష్ కు ఒక తప్పుడు వీడియోతో పోస్టు పెడితే.. తాను దొరికిపోతాననే కనీస స్పహ లేకుండాపోయిందా? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా ఉంది. పెద్దపెద్ద నేరాల్లోనే.. గంటల్లో పోలీసులు నిందితులను పట్టేసుకుంటున్న ఈ రోజుల్లో.. రెండు చేతులూ సవ్యంగా ఉన్నప్పుడు, ఒక చెయ్యి లేదని తనకు వికలాంగ పెన్షను రద్దు చేశారని వీడియో చేశాడు. కానీ.. అతని రెండు చేతులూ బాగా ఉన్న సంగతి ఊర్లో వాళ్లు బయటపెట్టడంతో అతను పారిపోయాడు.
అయితే ఇక్కడ కొన్ని అంశాలను లోతుగా గమనించాల్సి ఉంది. ఒక చెయ్యి దాచుకుని వీడియో పెట్టినంత మాత్రాన.. తన మీద పోలీసులు చర్య తీసుకుంటారనే స్పృహ ఈ రమేష్ కు లేకుండాపోయిందా? అనేది అందరి అనుమానం.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తరువాత.. అతడు చెబుతున్న కథలు ఇంకో రకంగా ఉన్నాయి. తన తండ్రి మరణించిన తర్వాత.. తన తల్లికి వితంతు పెన్షను మంజూరు కాలేదని, ఆ కోపంతో తను ప్రభుత్వాన్ని నిందించడానికి అలాంటి వీడియో చేశానే తప్ప.. తనకు చంద్రబాబు మీద, పవన్ కల్యాణ్ మీద ఎలాంటి కోపం లేదని అంటున్నారు.
పైగా సదరు రమేష్ పరారైన రెండు రోజుల్లో అతడు పోలీసులకు దొరికిపోయాక ఏం చెప్పాలనే విషయంలో మంచ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. అడిగినా అడగకపోయినా.. తనకు మానసిక స్థితి సరిగా లేదని, ఆరోగ్యం బాగా లేదని, మద్యం తాగిన మత్తులో ఆ వీడియో చేశానని అంటున్నారు. అయిదేళ్ల నుంచి ఇన్ స్టా వాడుతున్న, రీల్స్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు పోలీసుకేసు రాగానే.. తనకు మానసిక స్థితి సరిగా లేదని బుకాయించే ప్రయత్నం చేయడం అతి తెలివే.
అయితే.. ప్రభుత్వాన్ని నిందించడానికి కార్యకర్తలందరూ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని.. మీమీద కేసులు పెడితే భయపడవద్దని.. ఎవరిమీద ఎక్కువ కేసులు ఉంటే వారికి తమ ప్రభుత్వం వచ్చాక భవిష్యత్తు బాగుంటుందని, మంచి అవకాశాలు కల్పిస్తామని సజ్జల రామక్రిష్ణారెడ్డి పదేపదే చెబుతున్న మాటలు రమేష్ వంటి వారిని తప్పుదారి పట్టిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. పార్టీ నాయకుల దృష్టిలో పడాలంటే.. ఇలాంటి తప్పుడు పోస్టులతో పోలీసు కేసులతో సాధ్యం అవుతుందని ఒక స్కెచ్ ప్రకారం ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది. రమేష్ వంటి పావుల్ని కాదని, తమ మాటలతో వారిని రెచ్చగొడుతున్న సజ్జల వంటి మూలపురుషుల్ని విచారించాలని ప్రజలు అనుకుంటున్నారు.
సజ్జల ప్రేరేపణతోనే ఇలాంటి తప్పుడు పనులు!
Thursday, December 4, 2025
