జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడపజిల్లా టూర్ లో ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ఇప్పటికి ఏడుసార్లు బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిన జగన్.. ఈసారి సుదీర్ఘ క్యాంప్ తర్వాత నేరుగా కడపజిల్లాకు వచ్చారు. సోమవారం తండ్రి సమాధివద్ద ఆయన వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. బుధవారం యూకే పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇదెలా ఉండగ కడప పర్యటనలో పరామర్శలు, శుభాకాంక్షలు తెలియజేయడంతో గడిపిన జగన్, ప్రజలతో నాలుగు నెలల కిందట వేసిన డైలాగునే మళ్లీ వేయడం గమనార్హం. అభిమానులు కొందరికి అది ఆశ పుట్టించే మాటేగానీ.. చాలా మంది నవ్వుకోడానికి కారణమయ్యే మాట.
నాలుగునెలల కిందట అంటే, పోలింగ్ ముగిసిన రోజుల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి.. గత అయిదేళ్లలోనూ తన ప్రభుత్వానికి కీలకంగా సహకరించిన.. 2019లో అధికారంలోకి రావడానికి వ్యూహాలు అందించిన ఐప్యాక్ వారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి ఉద్యోగులతో కాసేపు గడిపారు. వారితో ఒక మాట చెప్పారు. ‘‘భవిష్యత్తు మనదే’’ అని అన్నారు. ‘చరిత్ర సృష్టించబోతున్నాం’ అని కూడా అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, మాటలు కాస్త జాగ్రత్తగా వాడకుండా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన ఏ రకంగా ప్రదర్శించారో మనకు అర్థం కాదు. అప్పుడందరూ చప్పట్లు కొట్టారు గానీ.. ఓటమి తేలిపోగానే.. ఐప్యాక్ అక్కడినుంచి దుకాణం కట్టేసుకుని వెళ్లిపోయింది.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో కూడా అదేమాట అన్నారు. కార్యకర్తలు నీరసించిపోకుండా అలాంటి మాట చెప్పడం మంచిదే. కానీ.. భవిష్యత్తు మనదే అనుకోవడానికి జగన్ ఇప్పుడు ఎలాంటి పార్టీ పునర్నిర్మాణ పనులు చేస్తున్నారని ఆయన మాటలు నమ్మి ఆనందించాలి..? అని కార్యకర్తలే అంటున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతూ ఉంది. జగన్ మరియు ఆయన చుట్టూ నిత్యం ఉండే కోటరీ రెడ్డి నాయకులు తప్ప పార్టీలో మరొకరు మిగిలే పరిస్థితి లేదేమో అని పలువురు సందేహిస్తున్నారు. నాయకులు చేరడమూ, వలసపోవడమూ కొత్త సంగతులు కాదు గానీ.. వెళ్లిపోతున్న వారి విషయంలో జగన్ తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు భవిష్యత్తు మనదే అని ఏ నమ్మకంతో జగన్ అంటున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
నాలుగు నెలల తర్వాత కూడా అదే డైలాగా?
Sunday, December 22, 2024