తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రెండే పదాల చుట్టూ తిరుగుతున్నాయి. అవే ‘విగ్రహాలు’, ‘విలీనం’! సచివాలయం దగ్గర ఎవరి విగ్రహం పెట్టాలనేది ఒక టాపిక్. భారాస ఏ జాతీయ పార్టీలో విలీనం అవుతుందనేది రెండో టాపిక్. అన్ని పార్టీల వాళ్లు కూడా ఈ రెండు అంశాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఆరోపణలు చేసుకుంటున్నారు.
తెలంగాణ సచివాలయం నిర్మించిన కేసీఆర్ సర్కారు.. పాత సచివాలయం ఎదురుగా ఉన్న అప్పటి తెలుగుతల్లి విగ్రహం స్థానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా నిర్లక్ష్యం చేసింది. అంతపెద్ద సచివాలయం కట్టారు, దాని ఎదురుగా గొప్ప అమరవీరుల జ్యోతి కూడా కట్టారు గానీ.. మధ్యలో తెలంగాణ తల్లిని కూడా అప్పట్లోనే పెడితే బాగుండేదని మాత్రం మర్చిపోయారు. వారి అలసత్వాన్ని కాంగ్రెసు పార్టీ ఇప్పుడు ఎడ్వాంటేజీగా మార్చుకుంది. సచివాలయం ఎదురుగా ట్రాఫిక్ ఐలాండ్ లో రాజీవ్ విగ్రహం పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ పాయింట్ చుట్టూ పెద్ద వివాదమే నడుస్తోంది. రాజీవ్ విగ్రహం పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సగౌరవంగా తొలగించి కాంగ్రెసు వారికి పంపుతామని, అప్పుడు నచ్చిన చోట పెట్టుకోవచ్చునని కేటీఆర్ హెచ్చరించారు. అసలు ఇప్పుడు విగ్రహాల చుట్టూ కాకుండా ప్రజాసమస్యలపై చర్చ జరగాలని బిజెపి అంటోంది.
రెండో టాపిక్ విలీనం! కల్వకుంట్ల కవిత ఇప్పటిదాకా బెయిలు దొరక్కుండా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీని చేసిన అభిషేక్ మను సింఘ్వి – సుప్రీంలో కవిత బెయిలు కోసం వాదిస్తున్నారని.. ఈ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బిజెపి ఆరోపిస్తోంది. కవితకు బెయిలు సంపాదించడం కోసం బిజెపితో విలీనం కావడానికి భారాస సిద్ధంగా ఉన్నదని కాంగ్రెస్ అంటోంది. వారిని విలీనం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని బిజెపి అంటోంది.
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో అసలు ప్రజా సమస్యలు పక్కదారి పట్టిపోతున్నాయనే ప్రచారం కూడా నడుస్తోంది. మరి నాయకులు ఏం చేస్తారో?
విగ్రహాలు.. విలీనం.. తెలంగాణలో రెండే టాపిక్స్!
Wednesday, January 22, 2025