తెలుగుదేశానికి బూస్ట్ లాంటి సంగతి ఇది!

Sunday, December 22, 2024

చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత.. ఆయన అవినీతికి పాల్పడ్డారని ప్రజలను నమ్మించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎంతగా తాపత్రయ పడుతున్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల ఆదరణ దృష్ట్యా గ్రాఫ్ పెరిగిందనే మాట వాస్తవం. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు పులిమి నిందించడం ఒక ఎత్తయితే, ఆయనను అరెస్టు చేసిన తీరు, కనీస వసతులు లేకుండా జైల్లో హింసిస్తున్న తీరును కూడా తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇదంతా చేదు అనుభవం కాగా, తెలుగుదేశానికి బూస్ట్ లాగా, మరింత నైతిక బలం అందించేలా ఒక సర్వే ఫలితాలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి.

శ్రీఆత్మసాక్షి గ్రూప్ పేరిట ఏపీలోని ప్రజల మూడ్ ఎలా ఉన్నదో తెలిపేలా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాం అంటూ.. ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ సర్వే ఫలితాలు తెలుగుదేశానికి కొత్త ఉత్సాహాన్ని అందించేలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం గ్యారంటీ అనే నమ్మకాన్ని బలపరిచేలా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి. 2023 సెప్టెంబరు 30వ తేదీనాటికి తెలుగు ప్రజల్లో ఉన్న మూడ్ ను ఈ సర్వే ద్వారా మదింపు చేసినట్టు సర్వే సంస్థ ప్రకటించింది. పైగా 2019 ఎన్నికలకు పూర్వం తాము వెల్లడించిన సర్వే ఫలితాలను మరోసారి గుర్తుచేసి అప్పట్లో జగన్ సర్కారు ఏర్పడుతుందని తాము జోస్యం చెప్పిన వైనం గుర్తుచేసింది. అప్పట్లో 139-142 సీట్లు వైసీపీకి వస్తాయనగా 151 వచ్చాయని, తెలుగుదేశానికి 22-28 వస్తాయనగా 23 వచ్చాయని, జనసేనకు 0-2 వస్తాయనగా 1 వచ్చిందని గుర్తుచేసి, తమ సర్వేలు నమ్మదగినవని చెప్పడానికి ప్రయత్నించింది. వారి తాజా సర్వే ఫలితాలు ఏంటంటే..

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా పోటీచేస్తే గనుక.. టీడీపీ 44 శాతం ఓట్ షేర్ తో అగ్రస్థానంలో ఉంది. వైసీపీకి 41.5 శాతం ఓట్ షేర్ దక్కుతుంది. అదే సమయంలో జనసేన షేర్ పెరిగి 10 శాతం అవుతుంది. బిజెపి ఓట్లు 0.5 శాతానికి దిగజారుతాయి.

టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే గనుక.. ఆ కూటమి 50 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. వైసీపీ ఓట్లు కాస్త పెరిగి 43 శాతానికి వస్తాయి. బిజెపి మాత్రం 0.5 శాతం మించి దక్కించుకునే అవకాశం లేదు.

అదే సమయంలో టీడీపీ, జనసేన కూటమిలోకి బిజెపి కూడా వస్తే గనుక.. ఆ కూటమికి పతనం గ్యారంటీ. కమలంతో జత కట్టిన ప్రభావంతో కూటమి ఓట్ షేర్ 43కు పడిపోతుంది. అదే సమయంలో వైసీపీ ఓట్ షేర్ 47కు పెరుగుతుంది. అంటే బిజెపితో పెట్టుకుంటే తెదేపా పతనం తప్పదన్నమాట.

టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకోవడానికి ఒకవైపు వామపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆ కాంబినేషన్ ను కూడా శ్రీఆత్మసాక్షి సర్వే స్టడీ చేసింది. వామపక్షాలతో కలిస్తే గనుక.. టీడీపీ జనసేన కూటమి ఓట్ షేర్ ఏకంగా 54 శాతానికి పెరుగుతుందని, అదే సమయంలో వైసీపీ 43 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. అదే జరిగితే బిజెపి ఓట్ షేర్ 0.5 నుంచి 0.75 శాతానికి రావచ్చునని వారి అంచనా.

మరి ఇలాంటి ఫలితాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి బూస్ట్ అవుతాయి. ఈ ఉత్సాహంతో తెలుగుదేశం శ్రేణులు కదనరంగంలో ఎలా దూసుకువెళ్తాయో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles