ప్రభుత్వ మనుగడకు సంబంధించిన రాష్ట్ర సుస్థిర అభివృద్ధిలో నిర్మాణరంగం కీలకం గనుక ఉచిత ఇసుక నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. అందుకే ఈ ఉచిత ఇసుక వ్యవహారంలో ఎలాంటి దందాలు జరగడానికి వీలులేదని అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని సొంత పార్టీ నాయకులు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచనలు చేస్తూ వచ్చారు. తాజాగా ఇసుక తవ్వకాలు సరఫరా పంపిణీ తదితర విషయాలలో పార్టీ నాయకులు పాత్ర అవసరం లేకుండా విధానం తయారు చేశారు చంద్రబాబు.
అయినా సరే ఇసుక విక్రయాలు అనేది ఒక ఆదాయ మార్గంగా భావించి.. తన సొంత పార్టీలోనే ఎవరైనా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతూ ఉంటే గనుక వారి మీద నిఘానేత్రం లాగా పని చేయాల్సిన బాధ్యతను కూడా సొంత పార్టీకే అప్పగిస్తున్నారు చంద్రబాబు నాయుడు! ఇది ఆయన తీసుకున్న విలక్షణమైన నిర్ణయం.
పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా ఏర్పాటు చేసిన విస్తృత కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం గురించి ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఇసుక విధానంలో ఎవరు తప్పు చేసినా సరే వారి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత తమకున్నదని.. అందుకు పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు అందరూ సహకారం అందించాలని ఆయన కోరుతున్నారు. దాని అర్థం ఉచిత ఇసుక విధానంలో సొంత పార్టీ వారు తప్పు చేసినా.. పార్టీలోని మిగిలిన వారు వారిని అడ్డుకోవాలని తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారన్నమాట. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం చంద్రబాబు రాజనీతికి నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.