తండ్రి స్థానంలో కొడుకు జైలుకు వెళ్లక తప్పదా?

Thursday, December 4, 2025

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటు చేసుకుంటోంది. రెండు రోజుల కిందట ఈ కేసులో అరెస్టు అయి రిమాండ్ లో గడుపుతున్న ఏ1 ప్రధాన నిందితుడు గంగిరెడ్డి కూడా బెయిలుపై విడుదలయ్యారు. మిగిలిన అందరు నిందితులు ఆల్రెడీ బెయిల్ పుచ్చుకొని బయటే ఉన్న నేపథ్యంలో గంగిరెడ్డి ఒక్కడిని జైల్లో ఉంచడం సబబు కాదని, ఆయన తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనను కోర్టు ఆమోదించింది. అయితే నేరుగా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కాకపోయినప్పటికీ అత్యంత కీలకమైన మరో ఘటనకు సంబంధించి ఇవాళ దర్యాప్తు ప్రారంభం అయింది. నలుగురు పోలీసు అధికారుల బృందం చేసే ఈ దర్యాప్తులో ఆరోపణలు నిజమే అని తేలితే గనుక వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు అందరూ మళ్లీ జైలు లోపలకు వెళ్లక తప్పదు. అందరికంటే ముందు ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన తండ్రి స్థానంలో కొడుకు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్2గా మారిన దస్తగిరికి ఎన్నడో బెయిలు వచ్చింది. ఆ తర్వాత మరో కేసులో ఆయన ఒక సందర్భంలో కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ వచ్చారు. ఆయన జైలులో ఉండగా జరిగిన ఘటన బెదిరింపుల పర్వం గురించి ఇప్పుడు విచారణ జరుగుతోంది. 2023లో దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఒక మెడికల్ క్యాంపు జరిగింది. ఆ మెడికల్ క్యాంపు ముసుగులో ఖైదీలకు వైద్య సేవలు అందించడానికి వెళ్లినది.. వివేకా హత్యకేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి. కడపజైలుకు వెళ్లి అక్కడ దస్తగిరిని వ్యక్తిగతంగా కలిసి బెదిరించినట్టు కేసు నమోదు అయింది.

వివేకా హత్య కేసులో అవినాష్ అండ్ కో కు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, చెబితే భారీ డబ్బు ముట్టజెబుతాం అని, చెప్పకపోతే చంపేస్తామని చైతన్య రెడ్డి జైల్లోనే బెదిరించినట్టుగా కేసు! అయితే అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసునుకూడా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కర్నూలు ఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందాన్ని వేశారు. వారు కడప జైలులో విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఆరోపణలు నిజమైతే.. అందరూ మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై బయటే ఉన్నారు. ఆయన బెయిలు రద్దు గురించి సుప్రీం కోర్టులో పిటిషన్ నడుస్తోంది. అయితే ఈ విచారణ తేలితే.. తండ్రి బయట ఉండగానే.. ఆయన కొడుకు, బెదిరింపులకు పాల్పడిన డాక్టర్ చైతన్యరెడ్డి ముందుగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles