జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇపుడు ఒక తీవ్రమైన అంతర్మథనంలో సతమతం అవుతున్నారు. ఎన్నికల వేళ ఆయన ఒక మెట్టు దిగివచ్చి రాజకీయం నడిపారు. మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్టీ నిర్మాణం, విస్తరణ మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతున్నారు. దీనికి సమాంతరంగా నామినేటెడ్ పోస్టుల వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడు కూడా ఇంకా ఒక మెట్టు దిగి రాజకీయం నడపాలా.. లేదా.. పార్టీ కోసం భిన్నమైన పోకడతో ముందుకు వెళ్లాలా అనే అంతర్మథనంలో పవన్ ఉన్నారు.
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చాలా సంయమనంతో వ్యవహరించారు. పొత్తుల్లో 60 సీట్లు తీసుకోవాలని పార్టీ నాయకులు పట్టుబడితే.. 30 సీట్లు మాట్లాడుకుని చివరికి 21 సీట్లు తీసుకున్నారు. హేళన చేయడం ద్వారా పవన్ ను రెచ్చగొట్టాలని వైసిపి నేతలు చాలావరకు ప్రయత్నించారు. ఆయన కించిత్తు కూడా రెచ్చిపోలేదు. పార్టీ నాయకులు కూడా చాలా చోట్ల తిరుగుబాటు బావుటా ఎగరేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ అతి కష్టం మీద మీద వారందరినీ బుజ్జగించి కూటమి విజయానికి కలిసికట్టుగా పనిచేసేలా ప్రేరణ అందించారు. మొత్తానికి సక్సెస్ సాధించారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణ, నిర్మాణం ప్రయత్నాల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసీన ప్రారంభించింది. ఇప్పుడు వెల్లువలా పార్టీ సభ్యత్వాలు నమోదు అయ్యే అవకాశముంది. అలాగే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల పందేరం సీజన్ నడుస్తోంది. ఎటూ ఎమ్మెల్యే సీట్లు తక్కువ తీసుకున్నాము గనుక.. పదవులు దండిగా తీసుకోవాలని పార్టీ వారినుంచి పవన్ పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. కనీసం పదవులు ఉంటే, పార్టీ నిర్మాణం సులువు అవుతుందని అంటున్నారు.
అయితే, తమ వాటాకు మించి నామినేటెడ్ పదవులు అడగడం వలన.. అసంతృప్తులు వస్తాయేమో అని.. కూటమి ఐక్యతలో లుకలుకలకు అది కారణం అవుతుందని పవన్ ఆలోచిస్తున్నారు. అది రాష్ట్రానికి మంచిది కాదని ఆయన తలపోస్తున్నారు. ఆయన అదే సంయమనం పాటిస్తారో లేదో వేచి చూడాలి.