మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినా, తాము కూడా వాటాలు తిన్న, భాగస్వాములు అయిన చాలా మంది ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. మరో 12 మంది అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారంట్లు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతానికి అలా వారంట్లు వచ్చిన జాబితాలో వారి పేర్లు లేవు గానీ.. వారిలో మాత్రం అరెస్టు భయం కనిపిస్తోంది. మద్యంకుంభకోణం మూడున్నర వేల కోట్ల స్వాహాపర్వంగా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలించేందుకు తోడ్పడిన ఇద్దరు అధికారులు కూడా ఇప్పుడు ముందస్తు బెయిలు కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. జగన్ హయాంలో ఏర్పాటు చేసిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, ఎక్సయిజు శాఖలో స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ ఇద్దరూ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం కుంభకోణం గురించి సిట్ దర్యాప్తు మొదలైన తొలిరోజుల్లోనే ఈ ఇద్దరు అధికార్లను విచారించారు. వారి ద్వారానే అసలు లిక్కర్ కొత్తపాలసీ రూపకల్పన ఎలా జరిగింది అనే పాయింట్ నుంచి ఎవరెవరు భాగస్వాములు అయ్యారో.. ప్రాథమిక వివరాలు అన్నింటినీ సిట్ సేకరించింది. వారి ద్వారా లభించిన వివరాల ద్వారానే రాజ్ కెసిరెడ్డి, అప్పట్లో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులందరినీ విచారించారు. వాసుదేవరెడ్డి సిట్ విచారణలో తన పేరు చెప్పినట్టుగా పత్రికల్లో రావడంతో.. అప్పట్లో మిథున్ రెడ్డి కూడా చాలా కంగారు పడ్డారు. అప్పట్లోనే ముందస్తు బెయిలు పిటిషన్ వేసుకున్నారు. ఆయన పేరు కేసులో అప్పటికి రానేలేదు. కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది. ఇంత సంచలనానికి కారణమైన ఆ ఇద్దరు అధికారులు ఇప్పుడు తాము ముందస్తు బెయిలు పిటిషన్లు వేసుకున్నారు. వారిలో అరెస్టు భయం మొదలైందా అనే అనుమానం పలువురికి కలుగుతోంది.
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరూ కొన్ని రోజుల కిందటే ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్లు వేశారు. సాంకేతిక కారణాల వల్ల అవి తిరస్కరణకు గురయ్యాయి. అప్పట్లో తాము అప్రూవర్లుగా మారుతాం అంటూ మరో పిటిషన్ కూడా వారు వేశారు. తాజాగా వారిద్దరూ మళ్లీ బెయిలు పిటిషన్లు వేసుకున్నారు. అయితే.. ఈసారి అప్రూవర్లుగా మారుతాం అనే పిటిషన్లను వేయకపోవడం గమనార్హం.
విచారణ ప్రారంభంలో సిట్ కు అనేక వివరాలు అందించి.. ఆ తర్వాత మిన్నకుండిపోయిన ఈ ఇద్దరు అధికారులు ఇప్పుడు ముందస్తు బెయిలు పిటిషన్లు వేసుకోవడంతో వారికి తాజాగా అరెస్టు భయం మొదలైందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అదే సమయంలో రెండోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించినప్పుడు అప్రూవర్ లుగా మారుతామనే పిటిషన్లు వేయకపోవడం కూడా రకరకాల అనుమానాలకు దారితీస్తోంది. వీరి పిటిషన్లను గమనిస్తే.. ఈ ఇద్దరు అధికార్లను మరోసారి కస్టడీలోకి తీసుకుని, ఇప్పటిదాకా సేకరించిన అన్ని రకాల సాక్ష్యాలను, ఆధారాలను మరోసారి ధ్రువీకరించుకునే ఆలోచనలో సిట్ ఉన్నదా అనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.
ఆ ఇద్దరూ కూడా జైలుకు వెళ్లాల్సిందేనా?
Friday, December 5, 2025
