మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’ పై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను ఏలూరులో పెద్ద ఎత్తున లాంచ్ చేశారు.
ఈ ఈవెంట్‌లో మంచు మనోజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాటల్ని వినగానే మంచు విష్ణును టార్గెట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. విశేషం ఏమిటంటే, మనోజ్ మాట్లాడిన విషయాల్లో తండ్రి మోహన్‌బాబు వల్ల వచ్చిన విలువల గురించి, తానెన్ని కష్టాలు ఎదుర్కొన్నాడన్నదీ ఉంది.
అయితే ఒక దశలో మనోజ్ మాట్లాడుతూ, తాను ఊర్లో లేనప్పుడు తన ఇంటి వస్తువులు బయటకు తీసేసారని, పిల్లలకి సంబంధించిన వస్తువులు కూడా రోడ్డు మీద పెట్టారని చెప్పారు. అంతే కాకుండా, తాను బయటికి వెళ్లేందుకు అవసరమైన కార్లను కూడా తీసుకెళ్లిపోయారని గుర్తు చేశారు. అయితే, ఇన్ని జరిగినా తనకు ఎవరి మీద కోపం రాలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎదుర్కొన్న కష్టాల్లో శివుడిని స్మరించుకుంటే, ఆయన తన అభిమానుల రూపంలో వచ్చాడని చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను న్యాయంగా నిలబడితే కొందరికి అది తప్పుగా అనిపిస్తోందన్నారు. తాను ఎప్పటికీ మోహన్‌బాబు కుమారుడేనని, చిన్ననాటి నుంచే నిజాయితీగా ఉండాలని తండ్రి చెప్పిన మాటలే తన బలంగా మారాయని చెప్పారు. మంచు మనోజ్ మాట్లాడిన ఈ మాటలు పరోక్షంగా మంచు విష్ణుపై వ్యాఖ్యలు చేసినట్టుగా మలుపు తిరుగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
