నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఎవ్వరూ ఎక్కడా కూడా తన ఫ్లెక్సిలు కట్టవద్దని కార్యకర్తలను ఆదేశించారు. కార్యక్రమాల వద్ద టపాసులు కాల్చవద్దని, గజమాలలు వేయవద్దని, ఫ్లెక్సిలు ఆడంబరాలకోసం డబ్బు వృథా చేయవద్దని కోరారు. ఫ్లెక్సిలకు పెట్టే డబ్బు అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వాల్సిందిగా కోటంరెడ్డి సూచించారు. తన నిర్ణయాన్ని గౌరవించకుంటే కార్యక్రమాలకు రానని కూడా తేల్చి చెప్పారు.
నిజానికి ఇది చాలా ఆదర్శవంతమైన నిర్ణయం. మామూలుగా చాలా దూకుడైన ఎమ్మెల్యేగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా మంచి ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కూడా. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నది తమ పార్టీనే అయినప్పటికీ.. ప్రజాసమస్యలమీద తీవ్రస్థాయిలో స్పందించేవారు. పార్టీతో విభేదించక ముందునుంచి కూడా ఆయన వైఖరి అలాగే ఉండేది.
ఇప్పుడు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల కడుపు నింపే ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు కూడా. కోటి రూపాయలు ఎవరైనా విరాళం ఇస్తే వారి పేరిట రాష్ట్రమంతా ఒక రోజు భోజనం పెడతామని కూడా ఆయన ప్రకటించారు. ఇదొక వైపు కాగా.. రాష్ట్రంలో ఫ్లెక్సీల పిచ్చి శృతిమించి పోతున్నదనేది కూడా వాస్తవం.
ఎమ్మెల్యే బొమ్మ ఒకటి పెద్దదిగా వేసి.. ఓ వంద మంది బొమ్మలు అందులో వేసుకుని ఆనందించే యువతరం తయారవుతోంది. రోడ్డు మీద వెళుతోంటే.. రోడ్డు కూడా కనిపించకుండా ఫ్లెక్సిలు అడ్డు నిలుస్తుంటాయి. రాష్ట్రంలో ఈ ఫ్లెక్సిలు అనేక ప్రమాదాలకు కారణమవుతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ ఫ్లెక్సిల వలన పర్యావరణానికి పెద్ద చేటు జ రుగుతోందన్నది కూడా గమనించాలి. ఇదంతా ఇంకో వైపు.
ఇలాంటి నేపథ్యంలో తన ఫ్లెక్సిలు ఎక్కడా వేయకుండా అందుకు అయ్యే డబ్బులన్నీ కూడా ప్రజలు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం మంచి పోకడ. ఇలాంటి నిర్ణయం ఎమ్మెల్యేలు అందరూ తీసుకుంటే అన్న క్యాంటీన్లు నిరాటంకంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తాయనడంలో సందేహం లేదు.
శెభాష్ కోటంరెడ్డి.. చాలా మంచి నిర్ణయం!
Wednesday, January 22, 2025