ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి గద్దె ఎక్కిన చంద్రబాబునాయుడును శెభాష్ అని తీరవలసిందే. ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా తాను అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా ఆశ్రిత పక్షపాతానికి చోటివ్వకుండా వ్యవహరించబోతున్నట్టుగా ఆయన తన చేతల ద్వారా సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలోనే ఎంతో కీలకమైన డీజీపీ పోస్టును ఆశ్రితులు, తన కొమ్ముకాసేవారు, భజంత్రీలు, భక్తులు అనే కొలబద్ధలతో కాకుండా.. కేవలం సీనియారిటీకే ఆయన పట్టం కట్టారు. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులలో అత్యంత సీనియర్ అయిన సీహెచ్ ద్వారకా తిరుమల రావు చేతిలో పెట్టారు. కొత్త డీజీపీ నియామకంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించారు.
సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఎంతో ముఖ్యమైన డీజీపీ పోస్టులో తమకు అనుకూలమైన వ్యక్తి ఉండాలని ముఖ్యమంత్రులు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు సీనియారిటీలో కాస్త వెనుకబడి ఉంటే.. ఆయన కంటె ముందున్న సీనియర్లందరికీ అదే హోదా కట్టబెట్టేసి.. ఇతర పోస్టుల్లో నియమిస్తారు. తమకు కావాల్సిన వ్యక్తి చేతిలో డీజీపీ బాధ్యతలు పెడతారు.
గత ప్రభుత్వ కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా.. అధికారంలోకి రాగానే డీజీపీగా దామోదర గౌతం సవాంగ్ ను నియమించారు. ఆయన ఎంతగా స్వామిభక్తి చూపించినప్పటికీ.. జగన్ కు అది చాల్లేదు. ఆయన మీద ఆగ్రహం వచ్చింది. పక్కకు తప్పించి.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించి.. తన కులానికే చెందిన, తన జిల్లాకే చెందిన కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డిని ఆ పదవిలోకి తీసుకువచ్చారు.
నిజానికి రాజేంద్రనాధ్ రెడ్డి కంటె చాలా మంది సీనియర్ అధికారులు ఉండగా.. వారినందరినీ కూడా పక్కన పెట్టారు. అప్రాధాన్య పోస్టులు అప్పగించారు. ఆ క్రమంలో భాగంగానే.. నిజాయితీ పరుడిగా పేరున్న సీహెచ్ ద్వారకా తిరుమల రావును ఆర్టీసీ ఎండీని చేశారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే.. సీనియర్ జాబితా చూసి.. ఆయననే డీజీపీని చేయడం విశేషం. ద్వారకా తిరుమల రావు 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్నూలు, కామారెడ్డి, ధర్మవరం, నిజామాబాద్ లలో ఏఎస్పీగా, అనంతపురం, కడప, మెదక్ లకు ఎస్పీగా వ్యవహరించారు. డీఐజీ ఐజీగా కూడా పలువిభాగాల్లో సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబారాబాద్ కమిషనర్ గా, విభజన తర్వాత విజయవాడ కమిషనర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఏపీ పోలీసు బాస్ గా నియమితులయ్యారు.
శెభాష్ బాబు! వంకరదార్లు వెతక్కుండా డీజీపీ నియామకం!
Thursday, November 14, 2024