వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులందరూ ఒక్కరొక్కరుగా చనిపోతూనే ఉన్నారు. కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయటే ఉన్నారు. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అంశాలుగా పేర్కొంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. వివేకా హత్యకేసులో సాక్షులందరూ అసహజ మరణాలకు గురవుతున్నారని, వారివన్నీ హత్యలేనని ఆమె అంటున్నారు. ఈ హత్యా రాజకీయాలకు వైఎస్ అవినాష్ రెడ్డే సూత్రధారి అనికూడా ఆరోపిస్తున్నారు. అవినాష్ బెయిలు మీద బయట ఉండి.. ఈ కేసులో మొత్తం సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారంటూ షర్మిల విమర్శలు కురిపిస్తుండడం విశేషం.
షర్మిల ఒక విషయంలో ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెయిలుపై బయట తిరుగుతున్న అవినాష్ రెడ్డి సాక్ష్యాలను అన్నింటినీ తారుమారు చేస్తున్నారని.. వివేకా కూతురు సునీతను కూడా చంపరని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారు బయట ఉండాలా? జైల్లో ఉండాలా? అనికూడా ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల సుప్రీం కోర్టులో రాష్ట్రప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి తనను బెదిరించారని వివేకా పీఏ కృష్ణారెడ్డి కేసు వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలాలు అన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని.. ఇద్దరు పోలీసు అధికారుల సాయంతో అవినాష్ రెడ్డి ఈ వాంగ్మూలాలను తయారుచేయించారని ఆరోపిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఇందుకోసం విచారణాధికారిని కూడా అవినాష్ రెడ్డి ఇంటికి పిలిపించుకుని బెదిరించారని ప్రభుత్వం పేర్కొంది.
షర్మిల కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి విచారణాధికారిని బెదిరించి.., వైఎస్ వివేకాను ఆయన కూతురు సునీతే హత్య చేయించినట్లుగా రిపోర్టు రాయించారని ఆమె ఆరోపిస్తున్నారు.
వివేకా హత్య గురించి ఇప్పుడు ఇంతగా చర్చ జరుగుతున్నదంటే ఇటీవల వచ్చిన హత్య సినిమా ఒక కారణం. అందులో వివేకాను ఆయన కూతురు హత్య చేయించినట్లు తీర్మానించేశారు. అప్పటినుంచి బెయిలు మీద బయట ఉన్న కీలక నిందితుడు సునీల్ యాదవ్ .. కేసులో అడ్డం తిరిగారు. సినిమాలో తనను, తన తల్లిని దారుణంగా చిత్రీకరించారని అంటున్నారు. వాస్తవాలన్నీ బయటకు చెప్తానని అంటున్నారు. అవినాష్ పాత్ర గురించి సినిమాలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సినిమా ద్వారా .. ప్రజల ఆలోచనలను దారి మళ్లించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ.. అవినాష్ రెడ్డి కోటరీ.. ఆ సినిమాను తయారుచేయించింది. దాని పర్యవసానంగా సైలెంట్ గా ఉన్న వ్యవహారాన్ని వారు తిరగతోడుకుంటున్నట్టుగా అవుతోంది.
అవినాష్ హత్యా రాజకీయాలపై షర్మిల డైరెక్ట్ ఎటాక్?
Wednesday, April 9, 2025
