రాహుల్ కంటె ముందు షర్మిల చెప్పేశారు!

Wednesday, January 22, 2025

మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుని తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. తమ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రావడం జరిగితే.. అమలు చేయడం అత్యంత కష్టసాధ్యం అని భయపెట్టే హామీలు కొన్ని ఇందులో ఉన్నాయి. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అసాధ్యం అనిపించేటువంటి హామీలు. అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే.. వీటిలో కొన్ని హామీలను సోనియా, రాహుల్, ఖర్గే కలిసి మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడానికంటె ముందే.. ఏపీలో షర్మిల ప్రజలకు హామీ ఇచ్చేశారు.

మేనిఫెస్టోలో అయిదు న్యాయాలు, 25 గ్యారంటీలు ఉన్నాయట. ప్రతి విద్యావంతుడికి అప్రంటిస్ గా పనిచేసే అవకాశం కల్పిస్తారట. ఇందుకోసం ఒక్కొక్కరి మీద రూ.లక్ష వెచ్చిస్తారట. మహిళా న్యాయ్ పేరు కింద పేద ఇంటి ఆడవారికి ప్రతి ఒక్కరికీ ఏడాదికి లక్షరూపాయలు ఇస్తారట. ఇంకా ఇలాంటివి కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదార్ న్యాయ్ వంటివి ప్రకటించారు. వీటిలో ప్రతి మహిళకూ ఏడాదికి రూ.లక్ష ఇస్తామనే హామీని షర్మిల కొన్ని రోజుల కిందటే వెల్లడించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే ఎటూ తాము అధికారంలోకి రాలేం అనే నమ్మకంతో వారు ఇచ్చినట్లుగా భావించగల హామీలు కొన్ని ఉన్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలని ఎందుకు అంటున్నారో తెలియదు. దానివల్ల.. దేశానికి లేదా ప్రజలకు ఏం నష్టం ఉన్నదని వారు సమర్థించుకోగలరో తెలియదు. జమ్ముకాశ్మర్ కు రాష్ట్ర హోదా ఇస్తాం అని చెబుతున్నారు. రాష్ట్రహోదా ఇవ్వడానికి బిజెపి వ్యతిరేకం ఏమీ కాదు. పరిస్థితులు కుదుట పడిన తర్వాత.. రాష్ట్రహోదా ఇస్తాం అని వారు కూడా చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో దాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తాం అని చెప్పకపోవడం ఒక ఊరడింపు. మార్చి 15 వరకు ఉన్న విద్యారుణాలు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తారట. ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందట. విద్యారుణాలకు వడ్డీ వరకు తాము చెల్లిస్తాం అని కొన్ని పార్టీలు హామీలు ఇస్తుండగా.. కాంగ్రెస్ మరీ అతిగా ఉన్న విద్యారుణాలన్నీ రద్దు చేసేస్తాం అని ప్రకటించం చిత్రంగా ఉంది.

మొత్తానికి తాము గెలవబోతున్నాం అనుకునే పార్టీలు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాయి. బాధ్యతగా ఉంటాయి. ప్రజలకు జవాబు చెప్పాలని భయంగా ఉంటాయి. గెలిచే అవకాశం లేని పార్టీలు చాలా పెద్దపెద్ద హామీలను ఇస్తుంటాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే అలాగే అనిపిస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles