వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏకైక వారసుడు తాను మాత్రమే అని చెప్పుకోవడం ద్వారా.. వైఎస్సార్ కు ఉండే ప్రజాదరణ మొత్తం తన ఓటు బ్యాంకుగా మారాలని తపనపడుతూ మాట్లాడుతూ ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన అనుచరులైతే షర్మిల అసలు వైఎస్ ఆర్ వారసురాలు కానే కాదని కూడా వాదిస్తుంటారు. బ్రాండ్ర జగన్, బ్రాండ్ వైఎస్ఆర్ అంటూ.. తండ్రి ఆదరణతో లబ్ధిపొందాలని చూస్తూ ఉండే జగన్.. స్వయంగా తండ్రికి అపకీర్తి దక్కేలా గతంలో కుట్ర చేశారా? జగన్ తన సొంత ప్రయోజనాల కోసం, తాను కాస్త సేఫ్ ఎడ్జ్ లో ఉండడం కోసం తండ్రి పేరును సీబీఐ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నించారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రజలు ఈ రకంగా సందేహించేలా.. వైఎస్ షర్మిల కొత్త సంగతులను బయటపెడుతున్నారు.
‘కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి న్యాయవాది వైఎస్సార్ పేరును చేర్పించారు. కేసులనుంచి జగన్ బయటపడే అవకాశం లేదని అర్థమైనందువల్లే న్యాయవాది సుధాకర్ రెడ్డి, కోర్టులో పిటిషన్ వేసి మరీ.. వైఎస్సార్ పేరును సీబీఐ చార్జిషీట్ లో చేర్పించారు’ అంటూ షర్మిల ఒక రహస్యాన్ని ఇప్పుడు ప్రజల ముందుకు తెచ్చారు.
అలా వైఎస్సార్ ను చార్జిషీట్ లో ఇరికించిన న్యాయవాదికి ఆ తర్వాత జగన్ అడ్వకేట్ జనరల్ పదవిని కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నిస్తున్నారు.
నిజం చెప్పాలంటే.. ఇలాంటి ఆరోపణలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చి తీరాలి. రాష్ట్రం మొత్తంలో కొంత శాతం.. కడప జిల్లాలో గణనీయంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమానులు ఉంటారు. వారిలోని అభిమానమే ప్రాణవాయువుగా జగన్ రాజకీయ జీవితం నడుస్తోంది. అలాంటిది.. వైఎస్ రాజశేఖరరెడ్డిని తన స్వార్థం కోసం సీబీఐ కేసుల్లో ఇరికించినది సొంత కొడుకే అని తెలిస్తే.. వారంతా జగన్ ను అసహ్యించుకుంటారు. అలా జరగకుండా ఉండాలంటే జగన్ ఈ విషయంలో వివరణ ఇచ్చుకోవాలి. తండ్రి పేరు చార్జిషీట్ లోకి వచ్చేలా తాను కుట్ర చేయలేదని నిరూపించుకోవాలి.
ఒకవైపు చిన్నాన్న అవినాష్ రెడ్డిని హత్య చేసిన వారిని జగన్ కాపాడుతున్నాడని, మళ్లీ పార్లమెంటుకు పంపడానికి తపన పడిపోతున్నాడని అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. చిన్నాన్న హత్య విషయంలో సొంత చెల్లెళ్లు చేస్తున్న విమర్శలతో జగన్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం ఏ కొంచెమైనా ఉంటే అది కాస్తా సడలిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో తండ్రికి అవమానం జరిగేలా కూడా జగన్ వ్యవహరించారని ప్రజలు నమ్మితే జగన్ కు పెనునష్టమే!
తండ్రి వైఎస్సార్‌పై జగన్ కుట్రను బయటపెట్టిన షర్మిల!
Wednesday, December 25, 2024