మెడికల్ కౌన్సిల్ నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోకుండా.. అసలు లాబొరేటరీల సహా ఎలాంటి వసతులు కల్పించకుండా.. పూర్తి స్థాయిలో అవసరమైన ఫాకల్టీని కూడా నియమించకుండా.. మెడికల్ కాలేజీలు ప్రారంభించి జగన్ వారి జీవితాలతో ఆడుకున్నారు. అదే దుర్మార్గం ఆర్కిటెక్చర్ విద్యార్థులతో కూడా నడిపించారు. అక్కడ ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన వారి జీవితాలు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. వారికి మద్దతుగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. జగన్ చేతగానితనం వల్ల అయోమయంలో పడిన ఈ విద్యార్థులకు కనీసం చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత.. అత్యుత్సాహంతో చేసిన పనుల్లో.. ఇది కూడా ఒకటి. ఢిల్లీలో ఉండే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వారి అనుమతి తీసుకోకుడానే.. ఆయన కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీని 2020లో స్థాపించారు. సీఓఏ అనుమతి మాత్రం రాలేదు. విద్యార్థులకు మాయమాటలు చెప్పి ఎడ్మిషన్లు ఇచ్చేశారు. ఆ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యకు ఇప్పటిదాకా అనుమతులు రాలేదు. దాంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారింది. ఒక బ్యాచ్ విద్యార్థుల చదువు పూర్తయిపోయినా కూడా.. గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు వస్తాయో లేదోననే అనుమానంలో వారు బతుకుతున్నారు. యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
అయితే వీరికి మద్దతుగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఒక్కరొక్కరు రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టి చదివారని, వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని షర్మిల ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు చేసిన తప్పులను, వంచనను సరిదిద్ది, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉన్నదని ఆమె అంటున్నారు.
అసలు ఇలాంటి యూనివర్సిటీ స్థాపనకు సీఓఏ అనుమతులు చాలా కీలకం కాగా, వాటి గురించి పట్టించుకోకుండా, ప్రారంభించేయడం ద్వారా.. జగన్ వందల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని షర్మిల నిందిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఎంపీగా ఉండి కూడా.. ఢిల్లీలోనే ఉండే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అధికారులను కలిసి.. తన నియోజకవర్గమైన కడపలో ఏర్పాటుచేసిన యూనివర్సిటీకి అనుమతులు సాధించడం గురించి పట్టించుకోకపోవడాన్ని షర్మిల తీవ్రంగా విమర్భిస్తున్నారు. రాజకీయంగా జగన్ తో విభేదాలు ఉంటే ఉండవచ్చు గానీ.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా కూటమి ప్రభుత్వం సీఓఏ అనుమతులు సాధించాలని వారు కోరుతున్నారు.
జగన్ అసమర్థతను దిద్దాలని షర్మిల విజ్ఞప్తి!
Friday, December 5, 2025
