పాపం షర్మిల.. ఆరాటం అంతా ఆ ఆరోపణపైనే!

Thursday, November 7, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విమర్శలు చేయడంలో ఒక తిరుగులేని కుటిలనీతిని అనుసరిస్తున్నదనే సంగతి అందరికీ తెలుసు. వారు నమ్మే సిద్ధాంతం ఒక్కటే. ప్రత్యర్థి ఎవ్వరైనా సరే.. మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తారు.. అంటిన మసిని వారే తుడుచుకోవాలి, కడుక్కోవాలి. పుష్కలంగా బురద చల్లి ఊరుకుంటారు. అవతలి వారే ఆ దుస్తులకు అంటిన మరకల్ని శుభ్రంచేసి ఉతుక్కోవాలి! ఇదే జగన్ దళాల నీతి. ఆ క్రమంలో వారు షర్మిల మీద కూడా అలాంటి ఆరోపణలే చేశారు. అయితే.. రాజకీయంగా ఇంకా పూర్తి జ్ఞానం వికసించిన వైఎస్ షర్మిల.. అవనసరంగా స్పందించి ఆ మసిని తుడుచుకోవడానికి, బురదను ఉతుక్కోవడానికి తాపత్రయపడుతున్నారు.

వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆందోళన నిర్వహించడానికి పూనుకుంటున్నారు. ట్రూఅప్ చార్జీలను పెంచడం ద్వారా చంద్రబాబు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వంలాగానే వ్యవహరించారట. వైసీపీ తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందట. తాను గెలిస్తే అదనపు భారం మోపబోనని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అవసరమైతే 35 శాతం చార్జీలు తగ్గిస్తానని చెప్పారట. ఇప్పుడు చార్జీలు పెంచారు గనుక.. మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా తమ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రజాందోళనలను నిర్వహించబోతున్నట్టుగా షర్మిల ప్రకటించారు.

ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. కొత్తగా పెరిగిన చార్జీల గురించి ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. వైసీపీ నాయకులు పేపరు పులుల్లా గర్జిస్తున్నారు. షర్మిల నేరుగా ప్రజాందోళనలు అంటోంది. వైఎస్సార్  కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గొడవ మొదలైన తర్వాత.. జగన్ దళాలు షర్మిల మీద విపరీతంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడుతో కుమ్మక్కు అయి, ఆయన స్కెచ్ ప్రకారమే షర్మిల పనిచేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి. చిన్న ఊర్లలో చిన్న నాయకులు కూడా ఆమెను తిట్టడం ప్రారంభించారు. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి షర్మిల ఈ ఆందోళనలను ఎత్తుకున్నట్టుగా కనిపిస్తోంది.

చంద్రబాబుతో తాను కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికి ఆమె తనే స్వయంగా ఆందోళనలకు పిలుపు ఇచ్చారు. ఆరోజున తెదేపా సర్కారును దూషించే పర్వం ఉంటుంది. తద్వారా చంద్రబాబుతో తాను కుమ్మక్కు కాలేదని ప్రజల ఎదుట నిరూపించుకోవడానికి ఆమె తాపత్రయపడుతున్నారు. ఈ ఆలోచన మంచిదే గానీ.. ప్రజల్లో లేని ఆందోళనను తన పార్టీ ద్వారా చూపించాలంటే ఆమె అభాసుపాలవుతారని ప్రజలు అంటున్నారు. అయినా.. పీసీసీ సారథి అయినంత మాత్రాన షర్మిల పిలుపు ఇస్తే రాష్ట్రంలో ఎన్నిచోట్ల సక్సెస్ అవుతుంది? అసలు ప్రజలు పట్టించుకుంటారా? అనేది మంగళవారం నాడు తేలుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles