సాధారణంగా బ్యాలెట్ బాక్స్ లలో ప్రజల తీర్పు మాత్రమే వెల్లడవుతుంది. అయితే ప్రత్యేకించి పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో ఆ నియోజకవర్గ ప్రజల చైతన్యం కూడా వ్యక్తం అయింది. ఈవీఎంలతో ఎన్నికలు జరిగి ఉంటే కేవలం ప్రజలు తమ ఓటు తీర్పును మాత్రమే తెలియజేసి ఉండేవారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరగడం వలన బ్యాలెట్ బాక్స్ లో తమ అభిప్రాయాలను, సంతోషాన్ని కూడా చీటీల రూపంలో తెలియజేశారు. ఈ చిన్న చిన్న చీటీలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
పులివెందులలో బ్యాలెట్ బాక్స్ లో ఒక ఓటరు ‘30 ఏళ్ల తర్వాత ఓటేశాను. అందరికీ దండాలు సార్’ అంటూ ఒక చీటీ వేశాడు. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయో.. ప్రజలను డమ్మీలుగా మార్చి వారితో నిమిత్తం లేకుండా ఎలా జగన్ దళాలు ఓట్లు వేసుకుంటూ చెలరేగుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ చిన్న చీటీలోని సందేశం చాలు! ఇందులోని విషయం గమనిస్తే… 30 ఏళ్లుగా అక్కడ ఎటు జడ్పిటిసి ఎన్నికలు జరగనే లేదు. అంతా ఏకగ్రీవమే! కాకపోతే ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా ఇన్ని సంవత్సరాలుగా తాను ఎప్పుడూ ఓటు వేసే అవకాశం రాలేదు అని సదరు ఓటును స్పష్టంగా చెబుతున్నాడు. వైఎస్ కుటుంబం ధోరణులకు నిదర్శనం.
అదే మాదిరిగా ఈ నియోజకవర్గ పరిధిలోని ఇంకో బ్యాలెట్ బాక్స్ లో మరొక చీటీ దొరికింది. అందులో ‘మా వివేకా సార్ కి న్యాయం చేయండి సార్’ అంటూ ఒక రాసి ఉంది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత సిట్ పోలీసులు ఏం తేల్చారో, సిబిఐ ఏం తేల్చిందో, అవినాష్ రెడ్డి ఎవరి మీద నిందలు వేస్తున్నాడో, నరెడ్డి సునీత రెడ్డి ఎవరిని అసలు దోషులుగా హంతకులుగా భావిస్తున్నారో.. ఈ విషయాలన్నీ పక్కన పెడదాం! పులివెందుల నియోజకవర్గ ప్రజలు మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదు అనే భావనతో ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఇందులో రెండో అభిప్రాయం కూడా లేదు.
ఓటర్లలో ఇంత స్పష్టమైన చైతన్యం వ్యక్తం కావడానికి, ఈ ఎన్నికలు ఒక వేదిక అయ్యాయి. అధికారులు ఎంతో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మాత్రమే ప్రజలు స్వేచ్ఛగా బూత్ ల దాకా వచ్చి ఓట్లు వేయగలిగారు అని అర్థమవుతోంది.
ఈ రెండు చీటీలు చెబుతున్న సందేశాలను అన్వయించుకుని చూస్తే.. ఆరు పోలింగ్ కేంద్రాలను అటు ఇటుగా మార్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంత ఘోరంగా ఎందుకు కంగారు పడిందో కూడా ఇప్పుడు అర్థమవుతోంది. పాత స్థానాలలోనే పోలింగ్ జరిగితే తాము విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసుకోవచ్చనేది వారి వ్యూహం. దానికి అడ్డుపడినందుకు పోలింగ్ కేంద్రాల మార్పుపై బీభత్సమైన గొడవ చేశారు. అయితే వారి గొడవను ఈసీ పట్టించుకోలేదు. సరికదా, హైకోర్టు కూడా తిరస్కరించింది.
ఇలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం వల్ల మాత్రమే బ్యాలెట్ బాక్సులో కేవలం ప్రజల తీర్పులు మాత్రమే కాకుండా ఇలాంటి చీటీలు సందేశాల పరంగా ప్రజలలో ఉన్న చైతన్యాన్ని, జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా బయటపెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పులివెందుల బ్యాలెట్ బాక్స్‌లలో సంచలన చీటీలు!
Friday, December 5, 2025
