రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొంత దెబ్బతింది. తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ పరిణామాన్ని చాలా చక్కగా వాడుకున్నారు. ఆయన కూడా తెలుగుదేశం నుంచి ఎదిగిన నాయకుడే గనుక.. ఆ పార్టీలో తనకున్న పాతపరిచయాలను వాడుకుని గెలిచిన చాలా మందిని గులాబీ పార్టీలో కలిపేసుకున్నాడు. ఆ రకంగా ప్రత్యర్థిని మరింత బలహీన పరిచేశాడు. అప్పట్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా పార్టీ పట్ల విశ్వాసంగా ఉండిఉంటే.. తర్వాతి ఎన్నికలకెల్లా టీటీడీపీ మరింత జవసత్వాలు పుంజుకునేది. కానీ అలా జరగలేదు. ఇష్టమున్నా లేకపోయినా.. వేరే మార్గం లేదన్నట్టుగా అందరూ గులాబీ గూటికి చేరారు. కానీ, కేసీఆర్ ఒంటెత్తు పోకడలతో వేగలేక, గులాబీ దళాలు పొగపెడుతోంటే సహించలేక అక్కడ కూడా అసంతృప్తితో వేగిపోతున్న నాయకులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ మీద కూడా ఫోకస్ పెంచుతున్న నేపథ్యంలో వారంతా తిరిగి తెలుగుదేశంలోకి వస్తారా అనే చర్చ జరుగుతోంది.
అలాంటి చర్చల్లో ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావుపేరు వినిపిస్తోంది. 2018 ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించినప్పటికీ, గులాబీ శ్రేణులు పట్టించుకోకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఒకప్పట్లో తెలుగుదేశంలో ఉండగా ఒక వెలుగు వెలిగిన తుమ్మలకు జిల్లాలో పార్టీ పరంగా అసలు గౌరవం దక్కడం లేదు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఇటీవల.. తన నియోజకవర్గం పాలేరులో కార్యకర్తలతో సమావేశమై.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీచేస్తానని అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. తెరాసను వీడేది లేదన్నారు. అంటే.. ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా? పార్టీలో ఉంటారా లేదా? అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారినందునే ఆ మాటలు వచ్చాయి.
తాజాగా మరో పరిణామం కూడా జరిగింది. సత్తుపల్లిలో రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సభకు డుమ్మా కొట్టిన తుమ్మల, ఎంపీని విడిగా కలిసి తన అభినందనలు తెలిపారు. సత్తుపల్లి కార్యక్రమానికి తనను జిల్లా పార్టీ ఆహ్వానించనేలేదని, పిలవకుండా ఎలా వెళ్లాలి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ ఆయనను పట్టించుకోవడంలేదని అర్థమవుతోంది.
అయితే ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఇదివరలా లేదు. కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు స్వీకరించిన తర్వాత.. అంతో ఇంతో దూకుడుగా ముందుకెళుతోంది. తెలంగాణలో అస్తిత్వం ఉన్న పార్టీగా తెలుగుదేశం కనిపిస్తోంది. పార్టీనుంచి బయటకు వెళ్లిన నాయకులు కొందరిని తిరిగి పార్టీలోకి తీసుకురావడం ద్వారా.. పార్టీ బలోపేతం అవుతున్నదనే సంకేతాలు పంపడానికి కాసాని తన ప్రయత్నం తాను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. తుమ్మల నాగేశ్వరరావు కూడా తిరిగి తెలుగుదేశంలోకి రావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణల దృష్ట్యా.. ఆయన చేరిక పార్టీకి బలం అవుతుందని అనుకుంటున్నారు. తుమ్మల తెరాసను వీడడం ఖరారే గానీ.. తదుపరి ప్రస్థానం ఎటు అనేదే ఇంకా తేలలేదని కొందరంటున్నారు. మొత్తానికి, తుమ్మల తెలుగుదేశం పునరాగమనం ఎప్పటికి ఖరారవుతుందో చూడాలి.