స్వార్థం, సంకుచితత్వం తప్ప జగన్మోహన్ రెడ్డికి మరొక ఆలోచన ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఎంతసేపూ తన సొంత గొడవ, తన సొంత సౌకర్యాలు, తన సొంత వ్యవహారాల కోసం పోరాడడం తప్ప ఆయన మరొక విషయం మీద దృష్టి పెట్టడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున హైకోర్టులో వేసిన మరొక తాజా పిటిషన్ గమనించినప్పుడు కూడా మనకు ఇదే సంగతి అర్థం అవుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా మారిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లోని ఒక భవంతి- గతంలో ఆయన క్యాంపు కార్యాలయం గా చలామణిలో ఉండేది. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి గనుక.. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో ఆ కార్యాలయం నిండా అత్యంత విలాసవంతమైన ఫర్నిచర్ ను జగన్ ఏర్పాటు చేయించుకున్నారు.
సీఎంగా ఆయనను ప్రజలు ఓడించిన తర్వాత, ఆ ఫర్నిచర్ ను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి ఆయనకు మనసొప్పలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కోడెల శివప్రసాద్ ను కేవలం ఫర్నిచర్ విషయంలో ఎంతగా వేధించి, పోలీస్ కేసులు పెట్టి మనోవేదనకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా జగన్ ప్రేరేపించారో అందరికీ తెలుసు. ఇప్పుడు తన పరిస్థితి కూడా అలాగే అవుతుందని భయపడిన జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ ని తిరిగి తీసుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయించారు. అందులో కొంత ఫర్నిచర్ కు విలువ కడితే ధర చెల్లిస్తాం అని కూడా లేఖలో ప్రతిపాదించారు. జీఏడీ నుంచి జవాబు రాకపోయేసరికి ఈ విషయం మీద కూడా హైకోర్టులో దావా వేశారు. తమ లేఖకు ప్రతిస్పందించలేదని ధావాలో పేర్కొనడం విశేషం. అయితే ఆపరేషన్ లో ఫర్నిచర్ గురించిన వివరాలు చాలా తప్పులు నమోదు చేసినందువలన పిటిషన్ సవరణలతో మళ్లీ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుక కరుచుకుని తప్పు దిద్దుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా కోర్టులలో వేసిన కేసులు అన్నీ కూడా ఆయన స్వార్థ, సొంత ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి మాత్రమే.. అని మనం గమనించాలి! రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ.. 10 శాతం ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష నేతగా అవకాశం దక్కదు అని తనకు తెలిసినప్పటికీ.. తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ ఆయన మొదటిసారిగా హైకోర్టును ఆశ్రయించి అభాసుపాలయ్యారు. అదేవిధంగా తాను ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. కాకపోతే మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ కూడా ఉన్నది.. అని స్పష్టంగా తెలిసినా తనకు సీఎం స్థాయిలో జెడ్ ప్లస్ ను మించిన భద్రత ఏర్పాట్లు ఉండాలని ఆయన డిమాండ్ చేస్తూ హైకోర్టులో మరొక పిటిషన్ వేశారు. మాజీ సీఎం అనే హోదాలో ఈ రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఎలాంటి భద్రత కల్పిస్తారో ఆయనకు కూడా అంతే ఉంటుంది తప్ప అదనంగా కోరుకోవడం అత్యాశ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టులో వేసిన మరో కేసు సరస్వతీ పవర్ ఆస్తుల పంపకం గురించి! తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డిడ్ కూడా చెల్లకుండా చేయాలని, వారికి పంచి ఇచ్చిన ఆస్తులను తిరిగి వెనక్కు తనకు ఇవ్వాలని కోరుతూ ఆయన ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా ఫర్నిచర్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఫర్నిచర్ ను తక్కువ ధరకు తనకు అమ్మేయాలని ఆయన కోరుకుంటున్నారు.
ఒక ప్రజా నాయకుడు మరీ ఇంత సంకుచితంగా వ్యవహరించడం అనేది ఆశ్చర్యకరమైన సంగతి. తన సొంత ప్రయోజనాలు, స్వార్థ లక్ష్యాలను తప్ప హైకోర్టును ఆశ్రయించడానికి ఐదు నెలల కాలంలో ఆయనకు ఒక్క ప్రజల సమస్య కూడా కనిపించకపోవడం చిత్రం! ఇలాంటి నాయకుడు ప్రజలను ఏం ఉద్ధరిస్తారు? అని అందరూ అనుకుంటున్నారు.
స్వార్థం, సంకుచితత్వం : హైకోర్టులో జగన్ పిటిషన్లు ఇవే!
Wednesday, January 22, 2025