జులై ఒకటో తేదీ ఈనాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహించిన తీరును చూసి ప్రజలు హర్షించడంలో వింత లేదు. కానీ చంద్రబాబు తీరును గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మధనపడిపోతుండడం, కుమిలిపోతుండడమే తమాషా! తమ ప్రభుత్వం ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి శైలిని అనుసరించి ఉంటే, ఈరోజు తాము ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదని వారు తమలో తాము కుమిలిపోతున్నారు. సహచర ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వడం ఎలాగో, ప్రజల దృష్టిలో వారి గౌరవం నిలబెట్టడం ఎలాగో చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని వారు కోరుకుంటున్నారు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అయ్యారు. చంద్రబాబు నాయుడు ఉదయం 6 గంటలకే పెనుమాక గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి అదే గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన బాటలోనే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటించి ప్రజలకు పెన్షన్లను అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నారు. ఇలా ఒక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో భాగస్వాములుగా ఉండడం వలన ప్రభుత్వ ప్రతిష్టతో పాటు, వారి వ్యక్తిగత ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ప్రజలు ఎమ్మెల్యేలను తమ సొంత మనిషిగా భావించే అవకాశం ఉంటుంది.
కానీ జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగినది ఏమిటి? ఆయన వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఉండవచ్చు. కానీ పెన్షన్ల పంపిణీలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అనేది లేకుండా చేశారు. పూర్తిగా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేయిస్తూ, పార్టీ ప్రజాప్రతినిధులను నాయకులను డమ్మీలుగా మార్చేశారు. ఎక్కడా కూడా పార్టీ పట్ల నాయకుల పట్ల ప్రజలలో ప్రజలలో ఒక అనుబంధం ఏర్పడడం అనేది కనబడకుండా పోయింది. ఇలా ఎమ్మెల్యేల పట్ల ప్రత్యేకమైన గౌరవం మిగలకుండా పోయిన తర్వాత వారితో ఏదో మొక్కుబడి కార్యక్రమం నిర్వహించినట్టుగా గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని బలవంతంగా నిర్వహింపజేశారు జగన్మోహన్ రెడ్డి!
అలాంటి కార్యక్రమంలో మా ప్రభుత్వం ద్వారా మీ ఇంటికి ఇన్ని లక్షల రూపాయలు అందించాం కాబట్టి మీరు మాకు రుణపడి ఉండాలి అని ఒక లేఖతో సహా ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు తిరిగి తిరిగి చెప్పారు. ఈ తంతు అంతా కూడా సొంత డప్పు కొట్టుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నంగా ప్రజలకు కనిపించిందే తప్ప, నాయకులతో ఒక అనుబంధం ఏర్పడడానికి అది ఉపయోగపడలేదు. ప్రతినెలా ఒక్కొక్క గ్రామంలో కనీసం పెన్షన్లు పంపిణీ నాడు నాయకులు తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ఉండి ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తమను పూర్తిగా లూప్ లైన్ లోకి పెట్టి జగన్మోహన్ రెడ్డి తన ఇష్టా రీతిగా పరిపాలన సాగించడం వలన, ఇవాళ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబును చూసి వైసిపి నేతల్లో అంతర్మధనం
Wednesday, January 22, 2025