వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి తాను ఒక కిరీటం లేని రాజునని, ఏదో కారణాంతరాల వల్ల ప్రస్తుతం కొంత విశ్రాంతి తీసుకుంటున్నానని, తన విశ్రాంతి పూర్తయిన వెంటనే.. తిరిగి పాలన పగ్గాలు చేబట్టి.. కొరడా ఝుళిపిస్తానని మనసులో సంపూర్ణంగా నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో వారంలో ఒకటిరెండు రోజులు గడిపితే.. మిగిలిన అయిదారు రోజులను గడపడానికి ఆయన ప్రతిసారీ బెంగుళూరు యలహంక రాజభవనానికి పారిపోతుండడం కూడా.. ఈ రాజరికపు భావనను సజీవంగా కాపాడుకోవడానికి మాత్రమే అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఈ రాజరికపు భావజాలంతోనే జగన్ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు ఏమీ ఊరుకోవడం లేదు. సాధారణంగా సాత్విక స్వభావం గలవాడిగా పేరున్న వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా.. జగన్ మోహన్ రెడ్డి అహంకారపూరిత మాటల పట్ల చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. ‘ఈరాష్ట్రం నీ అబ్బసొత్తా’ అంటూ డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నారు.
వైఎస్ జగన్ తన పాలన కాలంలో.. వైద్య కళాశాలల ప్రారంభం పేరిట పెద్ద డ్రామాను నడిపించిన సంగతి అందరికీ తెలుసు. ప్రారంభోత్సవాలు జరిగాయే తప్ప.. భవనాలు లేవు, లెక్చరర్లు లేరు, ల్యాబ్ లు లేవు.. అవకతవకగా ప్రారంభాలు ప్రకటించారు. వాటి దుర్గతిని పరిశీలించిన కూటమి సర్కారు.. పీపీపీ విధానంలోకి మార్చి నాణ్యమైన వైద్యవిద్యను విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి నిర్ణయించింది. వ్యవస్థ మొత్తం గాడిన పడుతుండేసరికి జగన్ సహించలేకపోతున్నారు. తాను అధికారంలోకి రాగానే.. వైద్య కళాశాలల పీపీపీ విధానానికి కుదిరే ఒప్పందాలన్నీ రద్దు చేస్తానని జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరిస్తున్నారు.
ఇప్పటికే.. జగన్ విధ్వంసక పాలనను ఒకసారి గమనించిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నట్టుగా చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడిదారుల్ని ఆహ్వానిస్తోంటే.. ‘మళ్లీ జగన్ సర్కారు ఏర్పడదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అలా చెప్పేట్లయితే మేం పెట్టుబడులు పెడతాం’ అని అనేక పెద్ద సంస్థలు భయపడుతున్నాయని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు జగన్ మాటలు మళ్లీ అదే నిరూపిస్తున్నాయి. చివరికి ప్రెవేటు పరం చేయడం కాకుండా.. పీపీపీ పద్ధతిలో వైద్యకళాశాలల్ని ఏర్పాటుచేస్తోంటే.. జగన్ చేస్తున్న దుష్ప్రచారంపై వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఘాటుగానే స్పందిస్తున్నారు.
‘రాష్ట్రం నీ అబ్బ సొత్తా.. టెండర్లు రద్దు చేయడం నీ తరం అవుతుందా’ అని సత్యకుమార్ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. జగన్ దుష్ప్రచారాలకు కూటమి నాయకులు అందరూ ఘాటుగానే స్పందిస్తుండడం విశేషం.
జగన్ పై సత్య ఎటాక్ : రాష్ట్రం నీ అబ్బసొత్తా..!
Thursday, December 4, 2025
